రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
మంచాల మండల కేంద్రంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రంగారెడ్డి జిల్లా రౌండ్ టేబుల్ సమావేశం అశాన్నగారి భుజంగారేడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో సుమారు 43.02 లక్షల మంది వికలాంగులు జీవిస్తున్నారు. వీరిలో 24.85 లక్షల మంది చేయూత పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నా ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయి. పెన్షన్లు మంజూరు కాకపోవడం వల్ల తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వికలాంగుల కార్పొరేషన్‌ను బలోపేతం చేయాలని, ప్రతి జిల్లాలో టీసీపీసీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాల్లో సవరణలు చేసి, స్థానిక సంస్థల్లో వికలాంగులకు ప్రాతినిధ్యం కల్పించేలా ప్రత్యేక చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించాలని డిమాండ్ చేశారు. తమిళనాడు, రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో ఇప్పటికే అలాంటి చట్టాలు అమల్లో ఉన్నాయని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్షణమే చట్టం చేసి వికలాంగుల రాజకీయ హక్కులను పరిరక్షించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్పీఆర్డీ స్పష్టం చేసింది. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి జర్కోని రాజు, ఎన్పీఆర్డీ నేతలు అశ్వాల బాలరాజు, కాలే మల్లయ్య, గ్యార బాష, యాదమ్మ, చిర దశరథ, దానయ్య, అలివేలు, చిర సత్తయ్య, బుస్సు పాండురంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.








