Mahaa Daily Exclusive

  మోసపూరిత హామీలకు కేరాఫ్ సీఎం రేవంత్ రెడ్డి – తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత..!

Share

భద్రాద్రి కొత్తగూడెం, జూలై 10 (మహా):
తెలంగాణ ప్రజలకు ఎన్నో మోసపూరిత హామీలు ఇచ్చి గద్దెనెక్కిన సిఎం రేవంత్ రెడ్డి ఆ హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెంది ప్రజలను మోసం చేశాడని, ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు.
గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం క్లబ్లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కేవలం 60 శాతం మాత్రమే రైతుబంధు అమలు చేశారని, గత ప్రభుత్వంలో కెసిఆర్ కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలకు లక్ష రూపాయలు ఇస్తే, లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేశాడని ఆరోపించారు. ఆసరా పెన్షన్లు 4 వేల రూపాయల వరకు పెంచుతామని మోసపూరిత హామీ ఇచ్చి బీద వర్గాలకు చెందిన ప్రజలను మోసం చేశారని కవిత ఆరోపించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంచి బిరుదుందని, అవినీతి చక్రవర్తి, అసమర్ధ ముఖ్యమంత్రి అని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఎంతోమంది ప్రాణ త్యాగాల మీద సాధించుకున్న తెలంగాణలో మూడోసారి ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి 18 నెలల్లో ఒక్కసారి కూడా జై తెలంగాణ అనే నినాదాన్ని పలకలేదన్నారు. జై భారత్.. జై కాంగ్రెస్ అంటాడే తప్ప జై తెలంగాణ అనే పదం ఇంతవరకు రేవంత్ రెడ్డి నోటి నుంచి వెళ్లలేదని ఆరోపించారు.
కొత్తగూడెం అంటేనే పరిశ్రమలు….
కొత్తగూడెం అంటేనే పరిశ్రమలు ఉన్న ప్రాంతమని కవిత గుర్తు చేశారు. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన స్పాంజ్ ఐరన్ పరిశ్రమ నేడు మూతపడి ఉందని, దానిని పునరుద్దరించినట్లైతే స్థానిక యువతకు ఎన్నో ఉద్యోగాలు వస్తాయి అని ప్రభుత్వాలు ఈ దిశగా ప్రయత్నం చేయాలని కవిత సూచించారు. బూర్గంపాడు మండలంలో ఐటిసి పరిశ్రమ కాలుష్యాన్ని సృష్టిస్తుంటే దాన్ని పట్టించుకునే పాపాన పోలేదు అన్నారు. కాలుష్యాన్ని నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. సింగరేణి సంస్థ ప్రధాన కార్యాలయం తోపాటు, ఐ టి సి పరిశ్రమ, భారజల కర్మాగారం, కేటీపీఎస్, బీటీపీఎస్ వంటి ఎన్నో పరిశ్రమలు కలిగిన కొత్తగూడెంకు ఎయిర్పోర్ట్ సదుపాయం కల్పించాలని కవిత గుర్తు చేశారు.

ఆంధ్రాలో విలీనమైన గ్రామాలను కలపాలి….
ఆంధ్రాలో మన రాష్ట్రానికి చెందిన ఐదు గ్రామాలు విలీనం అయ్యాయని తిరిగి ఆ గ్రామాలను తెలంగాణలో కలిపేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కి లేఖ రాయనున్నట్లు వెల్లడించారు. ఇదివరకే ఈ జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలని లేఖ రాశారని గుర్తు చేశారు. మొన్న భద్రాచలంలో ఏవో రమాదేవి ఆంధ్ర ప్రాంతంలోని భూములను చూడడానికి పోతే ఆమె మీద దాడి చేయడం జరిగిందన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ జాగృతి సత్తా చాటిన విధంగానే మరో మారు జాగృతి చైతన్యాన్ని ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాటి నుంచి ఇస్తా ఇస్తా అంటాడు. ఇవ్వకుండానే పోతాడు. టిఆర్ఎస్ తో చర్చలకు వస్తా వస్తా అంటాడు రాకుండానే పోతాడు. ఇంకేందయ్యా అంటే దేవుళ్ళ మీద ఒట్టేస్తాడు. ఒట్టేసిన విధంగా పనులు చేస్తాడు అంటే ఆ ఒట్టులను గట్టు మీద పెట్టి మొండికేస్తాడు. రాబోయే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం పక్క కోసమే తెలంగాణ జాగృతి నినాదం చేస్తుందని వెల్లడించారు. కెసిఆర్ ప్రగతి భవన్ కు రాట్లేదని ఎన్నోసార్లు విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు సెక్రటేరియట్ కు ఎందుకు వెళ్లట్లేదు చెప్పాలని నిలదీశారు. సెక్రటేరియట్‌లో వాస్తు లేదని నెపంతో సెక్రటేరియట్‌కు వెళ్లడం లేదని కవిత ఆరోపించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ జాగృతిని బలోపేతం చేసేందుకు సిఐటియు కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి, కొత్తగూడెం పట్టణ కన్వీనర్ గా ఉన్న డి వీరన్న మరియు జిల్లాలోని వివిధ సంఘాలకు చెందిన నాయకులు, నాయకురాళ్లు కవిత సమక్షంలో తెలంగాణ జాగ్రుతిలో చేరారు.

Latest