Mahaa Daily Exclusive

  సభకు స‌హ‌క‌రించండి: మీడియా కమిటీకి స్పీక‌ర్ ప్రసాద్ కుమార్ సూచన..!

Share

హైదరాబాద్, మహా

ఉభ‌య స‌భ‌లు స‌జావుగా జరగడానికి అంద‌రూ స‌హ‌క‌రించాల‌ని అసెంబ్లీ స్పీక‌ర్ గ‌డ్డం ప్రసాద్ కుమార్ కోరారు. తెలంగాణ లేజిస్లేటివ్ మీడియా అడ్వజరీ నూతన కమిటీ మొదటి సమావేశం బుధ‌వారం శాసనసభ భవనంలోని కమిటీ హాల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ లేజిస్లేటివ్ మీడియా అడ్వైజరీ నూతన కమిటీ ఛైర్మన్ ఐరెడ్డి శ్రీనివాస రెడ్డి , కో చైర్మన్ పరిపూర్ణా చారి, సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్యంలో కీలకమైన శాసనసభ, మండలి గౌరవం, ప్రాధాన్యతలను కాపాడుతూ మీడియా సలహా మండలి ద్వారా మీ వంతుగా సేవలను అందించడం మంచి అవకాశం అని చెప్పారు. సీనియర్ జర్నలిస్టులుగా మీరు ఎంతో అనుభవం ఉన్నవారని, ఉభయ సభలు సజావుగా జరగడానికి తమ వంతు సహకారాన్ని ఎల్లప్పుడూ అందించాలని కోరారు. శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. శాసన సభ, శాసన మండలి సమావేశాలు సజావుగా నడవాలి అంటే మీడియా పాత్రనే కీలకమ‌ని తెలిపారు. శాస‌నస‌భా వ్యవ‌హారాల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ… శాసనసభ, శాసన మండలి వ్యవహారాలలో మీడియాకు బాధ్యతను కల్పించడానికి, మరింత పాత్రను పోషించడానికే మీడియా అడ్వైజరీ కమిటీని నియ‌మించిన‌ట్లు తెలిపారు. ఉభయ సభల నిర్వాహణలో అందరి సహకారాన్ని కోరారు. కమిటీ ఛైర్మన్ ఐరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… సమావేశాల సందర్భంగా కవరేజ్ చేసే మీడియా ప్రతినిధులందరికి పాస్ లు అందే విధంగా సూచనలను అందిస్తామ‌ని స్పష్టం చేశారు. మీడియా ప్రతినిధులకు అవసరమయ్యే సౌకర్యాలపై అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని సూచనలను చేస్తామ‌ని తెలిపారు. ఈ సమావేశంలో లేజిస్లేటివ్ సెక్రటరీ డా.వి.నరసింహా చార్యులు, కమిటీ కో ఛైర్మన్ పరిపూర్ణా చారి, సభ్యులు పాల్గొన్నారు.

Latest