సత్తుపల్లి, మహా.
మధిర డివిజన్ పరిధిలోని బోనకల్లు, చింతకాని మండలాలకు చెందిన రైతులకు ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కల్పించేందుకు వ్యవసాయ, ఉద్యాన వన శాఖలు సోమవారం రైతు విజ్ఞాన యాత్రను నిర్వహించాయి.
ఈ సందర్భంగా రైతులు సత్తుపల్లి మండలం బేతుపల్లి గ్రామంలోని ఆయిల్ పామ్ తోటలను సందర్శించారు. అక్కడ సాగు విధానాలు, ఆదాయ అవకాశాల గురించి మధిర సహాయ వ్యవసాయ సంచాలకులు స్వర్ణ విజయ చంద్ర వివరించారు. ఆయిల్ పామ్‌తో పాటు వక్క, మిరియాలు, కోకో వంటి అంతరపంటల సాగు వల్ల వచ్చే లాభాలను తెలియజేశారు.
తర్వాత దమ్మపేట మండలంలోని అప్పారావుపేట వద్ద గల ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని రైతులు పరిశీలించారు. ఈ విజ్ఞాన యాత్రలో మండల వ్యవసాయ అధికారులు పసునూరి వినయ్ కుమార్, సోములపల్లి మానస, ఉద్యాన వన అధికారి విష్ణు, విస్తరణ అధికారులు బంధం రజిత, మరీదు త్రివేణి, గోగుల హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. రైతులతో పాటు ఆయిల్ పామ్ ఏరియా అధికారి బి. నరేశ్ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.








