హైదరాబాద్, మహా: హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర సచివాలయంలో ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా మాట్లాడారు. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని, లోతట్టు ప్రాంతాల్లో తగిన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వరద నీటి ఉద్ధృతి ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. రానున్న రెండు మూడు రోజులు వర్షాలు ఉంటాయనే సమాచారం ఉన్నందున కలెక్టర్లు జిల్లాల్లోని అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. ఎక్కడ కూడా ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో మాట్లాడి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సూచించారు.








