వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌పై మరోసారి తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. ఇటీవల భారత్‌పై 25 శాతం ప్రతీకార సుంకం విధిస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్.. తాజాగా మరిన్ని సుంకాలు విధిస్తానని హెచ్చరించారు. రష్యా నుంచి భారత్ భారీగా చమురు కొనుగోలు చేస్తోందని, ఆ చమురును మళ్లీ విక్రయిస్తోందన్నారు. బహిరంగ మార్కెట్‌లో చమురు విక్రయించి భారత్ లాభం గడిస్తోందంటూ ఆక్షేపించారు. భారత్ పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేయడం వల్ల రష్యాకు భారీగా ఆర్థిక వనరులు చేకూరుతున్నాయని, అందుకే ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపడం లేదని విమర్శించారు. ఈ మేరకు ఆయన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు. ‘రష్యాతో యుద్ధం వల్ల ఉక్రెయిన్‌లో ఎంత మంది ప్రాణాలు కోల్పోతున్నారో వాళ్లకు అవసరం లేదు. అందుకే భారత్‌పై సుంకాలను మరింత పెంచబోతున్నాం’ అని ట్రంప్ పేర్కొన్నారు.








