ఆదిలాబాద్ మహా : శనివారం కురిసిన భారీ వర్షం నేపథ్యంలో ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాలైన వికలాంగుల కాలనీ, జీఎస్ ఎస్టేట్ కానీలను జిల్లా కలెక్టర్ రాజర్షి షా , ఎస్పీ అఖిల్ మహాజన్ సందర్శించి పరిశీలించారు. అదిలాబాద్ రూరల్ లోని యశ్వంత్ గూడ నుండి భర్నూర్ వరకున్న తీన్ నాలా చెరువు కట్ట తెగిపోవడంతో పరిస్థితిని సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ ఎస్పీలు మాట్లాడుతూ జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాల మేరకు, వర్షాల కారణంగా జరిగిన పంట నష్టం, ఇళ్లలోకి నీరు చేరి, తదితర ఘటనలపై పూర్తి సమాచారం సేకరించి, ఎస్డీఆర్ఎఫ్ మార్గదర్శకాలను అనుసరించి తగిన సహాయం అందించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించామని తెలిపారు.
వర్షాల వల్ల ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడా పెద్ద స్థాయిలో నష్టం జరగలేదని పేర్కొన్నారు. అయితే, మరో 3,4 రోజుల పాటు వర్ష సూచనలు ఉన్నందున, అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.లో లైయింగ్ ఏరియాలు, నీరు పొంగి ప్రవహించే ప్రాంతాల్లో అధికారులు ఎప్పటికప్పుడు ఫీల్డ్‌లో ఉండాలని, ప్రజలకు అవసరమైన సమాచారం అందిస్తూ జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పెన్ గంగా నది ప్రవాహం పెరిగిన నేపథ్యంలో, బోరజ్, జైనథ్, బేలా మండలాల్లో వాటి పరిసర గ్రామాల్లో నీటి ప్రవాహం ముప్పు ఉందని పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో అధికారులను అప్రమత్తం చేసి, ప్రజలను ముందుగానే హెచ్చరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.చెరువులు తెగిపోవడం తో పంట చేలలో వరద నీరు చేరి పంట నష్టం ప్రాథమికంగా సుమారుగా 350 ఎకరాల్లో నష్టం జరిగినట్టు అంచనా వేసామన్నారు. పంటల నష్టం వివరాలు సర్వే నిర్వహించి తదుపరి చర్యల నిమిత్తం ప్రభుత్వానికి నివేదిక సమర్పించే చర్యలు ముమ్మరం చేస్తున్నామన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం పై అంచనా వేయాలని వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ స్వామిని ఆదేశించారు.అధికారులు మారుమూల గ్రామాలలో దెబ్బతిన్న రోడ్లు వంతెనలకు యుద్ధ ప్రాతిపదికన మరమత్తులు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఆన్ని చోట్ల మెడికల్ క్యాంప్ నిర్వహించాలని, ఈ సందర్భంగా పలు కాలనీలలో ఏర్పాటు చేసిన మేదికల్ క్యాంప్ లను జిల్లా కలెక్టర్ ఎస్పీ లు పరిశీలించారు. అలాగే ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహించాలని ఆదేశించారు.కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు, వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ స్వామి, పలు శాఖల సిబ్బంది తదితరులు ఉన్నారు.








