ఆదిలాబాద్ మహా: వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. సోమవారం స్థానిక తనీషా గార్డెన్ లో గణేష్ ఉత్సవ సమితి, మండప నిర్వాహక సమితి సభ్యులతో ఆయన సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. పండగను నవరాత్రోత్సవాలను ప్రశాంత వాతావరణంలో ప్రజలందరూ కలిసిమెలిసి నిర్వహించుకోవాలని, జిల్లా పోలీసు యంత్రాంగం ఇందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ఎస్పీ తెలిపారు.ఉత్సవాలలో పాటించవలసిన సూచనలతో కూడిన కరపత్రాలను ఆవిష్కరించారు. మండప నిర్వహణ కమిటీ సభ్యులు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని వివరాలను నమోదు చేయాలని సూచించారు. తద్వారా ఏర్పాటు చేయవలసిన బందోబస్తు కేటాయించవలసిన పోలీసు సిబ్బంది పై ఒక అంచనాకు రావచ్చన్నారు. తొమ్మది రోజుల ఉత్సవాలు ,నిమజ్జనం సమయంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ తగు ఏర్పాట్లను పూర్తి చేస్తున్నట్టు తెలిపారు. గ్రామాలలో సాధ్యమైనంతవరకు ఒకే గణపతి మండపం ఏర్పాటు చేసే విధంగా ప్రజలందరూ కలిసికట్టుగా ఉన్న భావాన్ని తెలియజేయాలని కోరారు. గతంలో ఏర్పాటు చేసిన మండపాలకు మాత్రమే అనుమతులు ఉన్నాయని, నూతనంగా ఏర్పాటు చేసే వారికి అనుమతులు లేవని తెలిపారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.పెద్ద శబ్ధాలతో డీజేలకు అనుమతి లేదన్నారు. రాత్రి 10గంటల తర్వాత మైక్ శబ్దాలతో ప్రజలకు ఇబ్బందులు కలిగించ వద్దన్నారు. మండపాల వద్ద ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టవద్దని రోడ్డుని పూర్తిగా ఆక్రమించి మండపాలు ఏర్పాటు చేసుకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఎఎస్పి కాజల్ సింగ్ , ఆదిలాబాద్ డిఎస్పీ జీవన్ రెడ్డి, పట్టణ సిఐలు బి .సునీల్ కుమార్, కె. నాగరాజు, రూరల్ సీఐ ఫణిధర్, జైనథ్ సిఐ డి సాయినాథ్, ఇచ్చోడ సీఐ బండారి రాజు, ఎస్సైలు సిబ్బంది, హిందు ఉత్సవ సమితి జిల్లా అధ్యక్షుడు బొంపల్లి హనుమాన్లు, హిందూ ఉత్సవ సమితి సభ్యులు మండప నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.








