మంచిర్యాల, మహా : సమాజ హితం కోసం సైన్యాన్ని సిద్ధం చేసిన మహనీయుడు సర్దార్ పాపన్న గౌడ్ అని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కొనియాడారు. సోమవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని
జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి చంద్రయ్య తో కలిసి హాజరై పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బహుజనుల సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేసిన మహా యోధుడు పాపన్న గౌడ్ అన్నారు. పీడితులు ఏకమై ఎదురు తిరిగితే రాజ్యాధికారం సాధించవచ్చని ప్రజలను చైతన్య పరచిన మహనీయుడు అని తెలిపారు. కుల, మత, వర్ణ విభేదాలు లేని సమాజం కోసం పోరాడేందుకు సొంత సైన్యాన్ని సిద్ధం చేసుకుని బహుజన రాజ్య స్థాపన చేశాడని తెలిపారు. సామాజిక న్యాయం కోసం, దోపిడీ వ్యవస్థ నిర్మూలన కోసం, మొగలాయిలను ఎదిరించి బహుజన ప్రజల కోసం అహర్నిశలు కృషి చేశారని వివరించారు. మహానుభావులను ఆదర్శంగా తీసుకుని వారి ఆశయ సాధనకు సమిష్టిగా కృషి చేయాలని వెల్లడించారు. భావితరాలకు తెలిసే విధంగా మహనీయుల జయంతి, వర్ధంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, వెనుకబడిన తరగతులు, గౌడ సంఘాల ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.








