Mahaa Daily Exclusive

  తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక బోనాలు నందివనపర్తిలో వైభవంగా పోచమ్మ బోనాలు అమ్మవారి దేవాలయానికి పోటెత్తిన భక్తులు..!

Share

రంగారెడ్డి జిల్లా మహా:
తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక సంస్కృతికి బోనాల పండుగ ప్రతీక. ప్రకృతితో మమేకమై జీవించే వ్యవసాయ ఆధారిత సమాజ సాంప్రదాయ సామూహిక తాత్వికత, బోనాల పండుగ సందర్భంగా యాచారం మండలం, నందివనపర్తి గ్రామంలో గురువారం పోచమ్మ తల్లి బోనాల జాతర భక్తిశ్రద్ధలతో కన్నుల పండుగగా నిర్వహించారు. బోనాల కార్యక్రమానికి మాజీ ఎంపీపీ రాచర్ల వెంకటేశ్వర్లు, బి.ఎన్.రెడ్డి ట్రస్టు చైర్మన్ బిలకంటి శేఖర్ రెడ్డి, మాజీ సర్పంచ్ డాక్టర్ రాజు నాయక్, కంబాలపల్లి ఉదయశ్రీ, మూడేడ్ల వెంకట్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
యాచారం మండలం, నంది వనపర్తి గ్రామంలోని ఆలయంలో తెల్లవారుజామున అమ్మవారికి ఆలయ అర్చకులు అభిషేకం నిర్వహించి తొలి బోనం సమర్పించారు. డప్పుచప్పుళ్ల మధ్య పోతురాజుల విన్యాసాలు, నృత్యాలతో ఊరేగింపుగా వచ్చారు. యువకుల కేరింతలతో సంతోషాల మధ్య బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది. సంప్రదాయబద్ధంగా ముస్తాబైన ఆడపడుచులు నెత్తిన బోనాలతో డప్పు చప్పుల మధ్య ఊరేగింపుగా తరలివచ్చి అమ్మవార్లకు బోనం నైవేధ్యంగా సమర్పించి మొక్కులను చెల్లించుకున్నారు. సాయంత్రం వేలాదిగా భక్తులతో అమ్మవారి ఆలయాలు కిటకిటలాడాయి. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండేలా చూడాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు మహిళలు తెలిపారు. అంటువ్యాధుల బారి నుంచి ప్రజలను కాపాడు తల్లీ అంటూ పోచమ్మను భక్తి శ్రద్ధలతో కొలిచారు.