Mahaa Daily Exclusive

  భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం. రెండో ప్రమాద హెచ్చరిక జారీ. ఏజెన్సీ ప్రాంతంలో తీవ్ర ఆందోళన. ..!

Share

ఖమ్మం, మహా.

గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. ఎగువప్రాంతాల నుంచి నిరంతరాయంగా ప్రవహిస్తున్న వరదనీరు భద్రాచలంలో నీటిమట్టాన్ని వేగంగా పెంచింది. ఆదివారం 48 అడుగుల మార్కును దాటడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. దీంతో భద్రాచల ఏజెన్సీ ప్రజల్లో ఆందోళన వాతావరణం నెలకొంది.

పవిత్ర స్నాన ఘట్టాల ప్రాంతం పూర్తిగా వరద ముంపులో చిక్కుకుంది. మెట్లు, విద్యుత్ స్తంభాలు నీటమునిగిపోయాయి. కల్యాణకట్ట వరకు వరదనీరు చేరి ఆ ప్రాంతం జలమయం అయింది. గోదావరిలో పవిత్రస్నానాల కోసం వచ్చే భక్తులు నదిలోకి దిగరాదని అధికారులు కఠిన హెచ్చరికలు జారీ చేశారు.

తూరుబాక వద్ద ప్రధాన రహదారిపైకి వరద నీరు రావడంతో దుమ్ముగూడెం, చర్ల, వాజేడు, వెంకటాపురం మండలాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ నాలుగు మండలాలు పూర్తిగా బాహ్యప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి. మరోవైపు వీఆర్‌పురం, కూనవరం, చింతూరు మండలాలు జలదిగ్బంధంలో చిక్కుకొని సహాయక చర్యలకు ఎదురుచూస్తున్నాయి.

అత్యవసర పరిస్థితుల్లో అధికారులు పర్యవేక్షణను కట్టుదిట్టం చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. వరద ప్రభావం మరింత పెరిగే అవకాశముందని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.

Latest