Mahaa Daily Exclusive

  సెప్టెంబరు 1 నుంచి మంచు ప్రాంతాల్లో జనగణన..! 40 ప్రశ్నలతో కేంద్రం ప్రశ్నావళి..

Share

• 40 ప్రశ్నలతో కేంద్రం ప్రశ్నావళి.
• కులం, మతం, విద్య, ఉద్యోగం, వలస వివరాలతో పాటు ఆధార్‌, ఓటర్‌ ఐడీపై ప్రశ్నలు.
ఢిల్లీ, మహా.
జనగణన-2027 ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాంతాల్లో ముందుగానే ప్రారంభించనుంది. సాధారణంగా జనగణన నిర్వహించడానికి అనువుగా లేని మంచు తీవ్రంగా కురిసే ప్రాంతాల్లో సెప్టెంబరు 1 నుంచి 30 వరకు జనాభా లెక్కల సేకరణ చేపట్టనున్నారు. లద్దాఖ్‌, జమ్ముకశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లోని మంచు ప్రాంతాల్లో ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఇందుకోసం ప్రజలను అడగాల్సిన 40 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా మృత్యుంజయ్‌ కుమార్‌ నారాయణ్‌ శుక్రవారం నోటిఫై చేశారు.

జనగణన చట్టం-1948లోని సెక్షన్‌ 8(1) కింద సంక్రమించిన అధికారాలను వినియోగించుకుని కేంద్ర ప్రభుత్వం ఈ ఆదేశాలను జారీ చేసింది. నియమిత అధికారులు తమ పరిధిలోని కుటుంబాల నుంచి ‘హౌస్‌హోల్డ్‌ షెడ్యూల్‌’ ద్వారా నిర్దేశిత అంశాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తారని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఇంటింటికీ వెళ్లి వివరాలు నమోదు చేయడంతోపాటు ముందుగా ప్రజలు స్వయంగా తమ సమాచారాన్ని నమోదు చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నారు.

ఈసారి జనగణనలో కుల వివరాల సేకరణ అత్యంత కీలక అంశంగా మారింది. స్వాతంత్య్రానంతరం దేశవ్యాప్తంగా నిర్వహించే జనాభా లెక్కల్లో సమగ్ర కుల వివరాలను నమోదు చేయడం ఇదే తొలిసారి. జనగణనలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందినవారా? కాదా? అనే వివరాలతోపాటు వ్యక్తి కులం ఏమిటనే ప్రశ్నను కూడా అడగనున్నారు. అయితే సిబ్బంది వద్ద కులాల ముందస్తు జాబితా ఉండదని, ప్రజలు స్వయంగా చెప్పిన కుల వివరాలనే నమోదు చేస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

వ్యక్తిగత వివరాల్లో భాగంగా వైవాహిక స్థితి, వివాహ సమయంలో వయసు, జీవిత భాగస్వామి పేరు, జాతీయత, మతం, ఎస్సీ, ఎస్టీ వివరాలను సేకరించనున్నారు. తల్లిదండ్రుల వివరాలు, వైకల్యం, మాతృభాష, తెలిసిన ఇతర భాషలు, అక్షరాస్యత, డిజిటల్‌ అక్షరాస్యత వంటి అంశాలపైనా ప్రశ్నలు ఉంటాయి. విద్యాసంస్థకు హాజరవుతున్నారా? అత్యున్నత విద్యార్హత ఏమిటి? ఏ విభాగం లేదా సబ్జెక్టులో విద్యనభ్యసించారు? వంటి వివరాలను కూడా నమోదు చేయనున్నారు.

ఉపాధి, ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన వివరాలనూ జనగణనలో సేకరించనున్నారు. గత ఏడాది కాలంలో ఉద్యోగం లేదా ఇతర ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొన్నారా? ప్రస్తుత వృత్తి ఏమిటి? వంటి ప్రశ్నలను అడగనున్నారు. దేశ జనాభాలో విద్య, ఉపాధి, వృత్తి, సామాజిక వర్గాల స్థితిగతులపై సమగ్ర సమాచారాన్ని పొందేందుకు ఈ వివరాలు ఉపయోగపడనున్నాయి.

వలసదారులకు సంబంధించి ప్రత్యేక ప్రశ్నలు ఉండనున్నాయి. వ్యక్తి జన్మించిన ప్రదేశం, అంతకుముందు నివసించిన ప్రాంతం, వలస రావడానికి కారణం, చివరిసారిగా వలస వచ్చిన తర్వాత ప్రస్తుత గ్రామం లేదా పట్టణంలో ఎప్పటి నుంచి నివసిస్తున్నారు, శాశ్వత నివాస చిరునామా వంటి వివరాలను సేకరించనున్నారు. దేశంలో జనాభా వలసల తీరును అంచనా వేయడానికి ఈ సమాచారం ఉపయోగపడనుంది.

జనగణన ప్రశ్నావళిలో మరికొన్ని సున్నితమైన, గుర్తింపు సంబంధిత వివరాలను కూడా చేర్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కొవిడ్‌-19 టీకా ఎక్కడ వేయించుకున్నారు, మొత్తం ఎన్ని బ్యాంకు ఖాతాలు ఉన్నాయి, మొబైల్‌ నంబర్‌, ఆధార్‌ నంబర్‌, ఓటర్‌ ఐడీ నంబర్‌, పాస్‌పోర్ట్‌ నంబర్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉందా? వంటి వివరాలను కూడా అడగనున్నారు. వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే నేపథ్యంలో గోప్యత, భద్రతకు సంబంధించిన అంశాలు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

మంచు ప్రాంతాల్లో జనగణన ప్రక్రియకు ముందు ఆగస్టు 17 నుంచి 31 వరకు ‘సెల్ఫ్‌ ఎన్్యూమరేషన్‌’కు అవకాశం కల్పించనున్నారు. ఈ సమయంలో ప్రజలు స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. అనంతరం సెప్టెంబరు 1 నుంచి 30 వరకు గణన సిబ్బంది క్షేత్రస్థాయిలో వివరాలను సేకరించనున్నారు. మంచు కారణంగా సాధారణ సమయంలో జనగణన నిర్వహించడం కష్టమైన ప్రాంతాల్లో ముందుగానే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది.

దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో జనగణన ప్రక్రియ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. వాస్తవానికి 2021లో జరగాల్సిన జనగణన కొవిడ్‌-19 మహమ్మారి కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు జనగణన-2027ను భారీ స్థాయిలో నిర్వహించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం ప్రక్రియ కోసం రూ.11,718 కోట్ల నిధులను కేంద్రం కేటాయించింది. సిబ్బందికి శిక్షణ, గౌరవ వేతనం, సాంకేతిక మౌలిక సదుపాయాల కల్పన తదితర అవసరాల కోసం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇప్పటివరకు రూ.4,102 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర హోంశాఖ ఇటీవల పార్లమెంట్‌కు వెల్లడించింది.

జనగణన-2027ను సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించేందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సమన్వయంతో మాస్టర్‌ ట్రైనర్లు, ఫీల్డ్‌ ట్రైనర్లు, గణనకర్తలు, సూపర్‌వైజర్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. మిగిలిన శిక్షణను నిర్దేశిత షెడ్యూల్‌ ప్రకారం కొనసాగిస్తున్నారు.

జనగణనలో కుల వివరాలను సేకరించాలన్న నిర్ణయాన్ని గత ఏడాది ఏప్రిల్‌ 30న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ రాజకీయ వ్యవహారాల కమిటీ తీసుకుంది. దీంతో దశాబ్దాల తర్వాత దేశవ్యాప్తంగా కుల ఆధారిత జనాభా వివరాలు అధికారిక గణాంకాల రూపంలో అందుబాటులోకి రానున్నాయి. భవిష్యత్తులో సామాజిక సంక్షేమ పథకాలు, వనరుల కేటాయింపు, వివిధ వర్గాల అభివృద్ధి విధానాల రూపకల్పనలో ఈ గణాంకాలు కీలకంగా మారే అవకాశం ఉంది.

Latest