హన్మకొండ మహా;
హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలంలోని మల్లారెడ్డి పల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాము వద్ద గ్రామస్తులు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి యూరియా బస్తాల కోసం చెప్పులు లైన్ లో పెట్టి పడిగాపులు కాస్తున్నారు. బుధవారం లారీ లోడులో 260 యూరియా బస్తాలు రాగా అందులో నుండి దాదాపు 150 బస్తాలు రాజకీయంగా పలుకుబడి ఉన్న వారే గుట్టుచప్పుడు కాకుండా తీసుకొని వెళ్లారని పలువురు రైతులు ఆరోపించారు. రైతుకు ఒక్క యూరియా బస్తా ఇస్తామని వ్యవసాయ శాఖ అధికారులు, సొసైటీ అధికారులు చెప్పగానే రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో రైతుకు 5 నుండి 6 ఎకరాల భూమి ఉంటే ఒక బస్తా యూరియా ఇవ్వడం ఏంటని రైతులు ప్రశ్నించారు.తమకు ఇచ్చిన కార్డుల ద్వారా పంపిణీ చేయాలని వారు కోరారు. కాగా వచ్చిన బస్తాల ఆధారంగా అందరికీ వచ్చే విధంగా ఒక్కొక్కరికి ఇస్తామని అధికారులు సమాధానం చెప్పడంతో గందరగోళం నెలకొంది.






