మంచిర్యాల, మహా : మంచిరాల జిల్లా వివిధ ప్రభుత్వ శాఖలలో సమస్యల పరిష్కారం కొరకు ప్రతి సోమవారం ప్రజావాణి అర్జీదారులు సమర్పించిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. సోమవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. చంద్రయ్య, మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాస్ రావు లతో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. మంచిర్యాల మునిసిపాలిటీ 17వ వార్డు పాదం శ్రీలత, పూదరి శ్రీనివాస్ భార్యాభర్తల తాము ఇద్దరము దివ్యాంగులమని, గతంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా ప్లాస్టరింగ్ దశలో ఉందని, మున్సిపల్ జాబితాలో ఎల్ 1 లో ఉన్నామని, తమ పరిస్థితిని పరిశీలించి ఇందిరమ్మ ఇల్లు వర్తింప చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. కాసిపేట మండలం మల్కేపల్లి గ్రామానికి చెందిన కసాడి శ్రీనివాస్ 1993 వరకు తమ గ్రామం ఎస్.సి. రిజర్వుడ్ సర్పంచ్ గా పరిగణించబడిందని, 2001 లో కొందరి నిర్లక్ష్యం కారణంగా ఎస్.టి. రిజర్వుడ్ గా మార్చబడిందని, ప్రస్తుత ఎన్నికల నిర్వహణలో రిజర్వేషన్ మార్చగలరని కోరుతూ అర్జీ సమర్పించారు. బెల్లంపల్లి పట్టణానికి చెందిన హరికిషన్ పాండే పట్టణంలోని యువ సంఘటన పాఠశాల సమీపంలో గల వాటర్ ట్యాంక్ శిథిలావస్థలో ఉందని, ఎలాంటి ప్రమాదం జరగకముందే తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. నస్పూర్ మండల కేంద్రానికి చెందిన కె.శ్రీనివాస్ తాను కొనుగోలు చేసిన భూమిలోనికి ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తున్న వ్యక్తి అక్రమంగా చొరబడి నిర్మాణం చేపడుతున్నాడని, ఈ విషయమై విచారించి తనకు న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. మంచిర్యాల పట్టణానికి చెందిన పిన్న సాయితేజ తాను సాదాబైనమా ద్వారా కొనుగోలు చేసిన భూమిని క్రమబద్ధీకరణ కొరకు దరఖాస్తు చేసుకోగా తిరస్కరించడం జరిగిందని, ఈ విషయమై దరఖాస్తును పునరుద్ధరించి తనకు న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తులు చేసుకున్న ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.






