- ఆపండి
- సర్కారు జీవోకు హైకోర్టు బ్రేక్
- స్థానిక ఎన్నికలు రద్దు
- ఉదయం నోటిఫికేషన్.. సాయంత్రం రద్దు ప్రకటన
- ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం
- హైకోర్టు ఆదేశంపై బీసీ సంఘాల ఆగ్రహం
- నేడు రాష్ట్రబంద్ కు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఎంపీ ఆర్. క్రిష్ణయ్య పిలుపు
- బీసీ బిల్లుకు బీజేపీ, బీఆర్ఎస్సే అడ్డంకి- పీసీసీ చీఫ్ ఫైర్
హైదరాబాద్, మహా
స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడంపై హైకోర్టు స్టే విధించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ కౌంటర్లపై అభ్యంతరాలకు దాఖలుకు పిటిషనర్లకు రెండు వారాల గడువు విధించింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పైనా హైకోర్టు స్టే విధించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ ఆరు వారాలపాటు నిలిచిపోనుంది. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో రెండు రోజుల పాటు సుదీర్ఘ వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. బీసీ కులగణనకు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిందని, స్వాతంత్ర్యం తర్వాత సమగ్ర కులగణన సర్వే తెలంగాణలోనే జరిగిందని అన్నారు. ఇంటింటికెళ్లి సర్వే చేశారని, ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో బీసీ జనాభా 57.6శాతం ఉన్నట్లు తేలిందన్న ఆయన.. 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు కోర్టుకు వివరించారు. బీసీల్లో రాజకీయ వెనుకబాటుతనం ఉందని గుర్తించే.. అసెంబ్లీ తీర్మానం చేసిందన్నారు. మరో న్యాయవాది రవివర్మ తన వాదనలు వినిపిస్తూ… రాజ్యాంగంలో రిజర్వేషన్లపై ఎక్కడా 50శాతం సీలింగ్ లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు కలిపి 85 శాతం జనాభా ఉన్నారని, 85 శాతం జనాభాకు 42 శాతంతో కలిపి 67 శాతమే రిజర్వేషన్లు ఇస్తున్నామని వివరించారు. 15 శాతం జనాభాకు 33 శాతం ఓపెన్‌గానే ఉందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్‌పై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎలక్షన్ ప్రక్రియకు బ్రేక్ పడింది.
స్థానిక ఎన్నికలు రద్దు
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 29న విడుదల చేసిన స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ను నిలిపివేసినట్లు ప్రకటించింది. హైకోర్టు ఆదేశాల మేరకే ఈ చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ఎన్నికల కోడ్ అమలు, నామినేషన్ల ప్రక్రియను నిలిపివేసినట్లు తెలిపింది. తదుపరి నోటిఫికేషన్ ఇచ్చేవరకు ఎన్నికల ప్రక్రియలన్నీ నిలిపివేసినట్లు ప్రకటించింది. స్థానిక ఎన్నికల రద్దుతో రిజర్వేషన్ తో సంబరపడ్డ వారు నిరాశకు గురికాగా, రిజర్వేషన్లతో అవకాశాలు దెబ్బతిన్నవారు సంతోషపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా రిజర్వేషన్ల చర్చ హాట్ టాపిక్ గా మారింది.
భగ్గుమన్న బీసీ సంఘాలు
హైకోర్టు ఆదేశంపై బీసీ సంఘాలు భగ్గుమన్నాయి. బీసీల నోటికాడ కూడు లాక్కున్నారంటూ బీసీ నేతలు తీవ్రస్థాయిలో భగ్గుమనగా, రిజర్వేఫన్ల కోసం గట్టిగా ప్రయత్నించిన కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ, బీఆర్ ఎస్ టార్గెట్ గా విమర్శలు గుప్పించింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వ తీర్పును నిరసిస్తూ బీసీ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న రాష్ట్రబంద్ కు పిలుపునిచ్చారు. ఎంపీ ఆర్ .క్రిష్ణయ్య కూడా రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చారు. 30 ఏళ్ళుగా బీసీ రిజర్వేఫన్ల కోసం పోరాటం చేస్తున్నామన్నారు.







