- పేదలకో న్యాయం… పెద్దలకో న్యాయం
- హైడ్రా అరాచకాలపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్
- 500 రోజుల్లో అధికారం మాదే
- హైడ్రా బాధితులకు న్యాయం చేస్తాం
హైదరాబాద్, మహా : చట్టం అందరికీ సమానమే అయినప్పటికీ కాంగ్రెస్ పాలనలో పేదలకు మాత్రమే చట్టం అన్నట్లుగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పెద్దవాళ్లకు ఒక న్యాయం.. పేద వాళ్లకు ఒక న్యాయం నినాదంతో తెలంగాణ భవన్‌లో ఆదివారం ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ ఎగ్జిబిషన్ లో హైడ్రా అరాచకాలపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాబోయే 500 రోజుల్లో తిరిగి కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని, హైడ్రా వల్ల అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో హైడ్రా పేరుతో ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు ఎంతో మంది బాధితులుగా మారారన్నారు. కేసీఆర్ హయాంలో ఎక్కడ చూసినా కట్టడాలే కనిపిస్తే కాంగ్రెస్ హయాంలో కూల్చి వేతలే కనిపిస్తున్నాయని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోనే లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించామని, వైట్ హౌస్‌ను తలదన్నేలా సచివాలయం కట్టామని, దేశంలోనే అతిపెద్ద పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కట్టుకున్నామన్నారు. హైదరాబాద్‌లో 42 ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు, ప్రతి జిల్లాలో కలెక్టరేట్‌లు కట్టుకున్నామని వివరించారు. నీటి ప్రాజెక్టులు కట్టుకున్నాం. ఒకటి రెండు కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ కొత్త నిర్మాణాలు చేసుకున్నామని కేటీఆర్ గుర్తు చేశారు.
కాంగ్రెస్ ఈ రెండేళ్లలో ఒక్క ఇటుక పెట్టలేదన్నారు. రెండేళ్లలో రేవంత్ రెడ్డి చేసింది ఏంటంటే కూలగొట్టడమే అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల జరిగిన అన్యాయానికి ఎంతో మంది బాధితులుగా మారారని, 500 రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం రానుంది, మా ప్రభుత్వం రాగానే ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామన్నారు. ఇంత అన్యాయంగా, కిరాతకంగా పనిచేయాలని ఎవరూ కోరుకోరని, పేదవాడికి ఒక న్యాయం.. ఉన్నవాడికి ఒక న్యాయం.. ఇది ఈ ప్రభుత్వ పనితీరు అని దుయ్యబట్టారు. హైడ్రాపై భట్టి విక్రమార్క పెద్ద ప్రజంటేషన్ ఇచ్చారంటూ ఆ రోజు భట్టి ఇచ్చిన ప్రజంటేషన్‌లో చాలా విషయాలు చెప్పారన్నారు. చాలా బిల్డర్ల పేర్లు చెప్పారు కానీ.. మేం ఏ బిల్డర్‌ను ఇబ్బంది పెట్టదలుచుకోలేదని స్పష్టం చేశారు. పేదవాడి ఇంటికి వచ్చిన బుల్డోజర్ ఆ బిల్డర్ల జోలికి ఎందుకు వెళ్లలేదో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. పేదలు కోరుకునేది ఒక్కటే కూడు గూడు గుడ్డ.. అలాంటి పేదల ఇళ్లను ప్రభుత్వం కూల్చేయడం దారుణమన్నారు. ప్రభుత్వానికి అంతా సమానమైతే పెద్ద వాళ్ల జోలికి ఎందుకు వెళ్లలేదని నిలదీశారు. పేదల ఇళ్లు కూలగొట్టలేదని హైడ్రా కమిషనర్ చెబుతున్నారని పేర్కొంటూ పేపర్లు, కోర్టు తీర్పులు ఉన్నా కూడా టైమ్ ఇస్తే కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటారని చెబుతున్నారని మండిపడ్డారు. ఫుల్ ట్యాంక్ లెవల్లో కడితే ఎవరిని వదలం అని చెప్పి పెద్దలను వదిలేశారన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెరువును పూడ్చి ఇల్లు కట్టారని కేటీఆర్ పేర్కొన్నారు. రెవెన్యూ మంత్రి ఇంటికి వెళ్లే ధైర్యం హైడ్రా కమిషనర్ చేస్తారా? మరో మంత్రి వివేక్ కూడా హిమాయత్ సాగర్ చెరువు వద్ద ఇల్లు కట్టుకున్నారు. వీళ్లను ముట్టే ధైర్యం హైడ్రా చేస్తుందా? రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్ లోపల ఇల్లు కట్టుకున్నారు. సున్నం చెరువులో ఇల్లు కట్టుకున్న పేదలది తప్పు దుర్గం చెరువులో కట్టిన తిరుపతి రెడ్డిది ఏ తప్పులేదా అని నిలదీశారు. పేదలకు అసలు టైమ్ ఇవ్వరు కానీ తిరుపతి రెడ్డికి టైమ్ ఇచ్చి కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునేలా చేసింది వాస్తవం కాదా అని అడిగారు.
ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి చెరువు మధ్యలోనే ఇల్లు కట్టుకున్నారు. ఆయనకు నోటీసులు ఇచ్చే దైర్యం హైడ్రాకు ఉందా? మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చెరువులోనే ఇల్లు కట్టుకున్నారు వాళ్ల దగ్గరకు వెళ్లి.. వారికి నోటీసులు ఇచ్చే దమ్ము అధికారులకు ఉందా? పెద్ద పెద్ద ఫామ్ హౌజ్‌లు, ఇల్లులు కట్టుకున్నా అడిగేవారు లేరని కేటీఆర్ మండిపడ్డారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ.. గాజులరామారంలో 11 ఎకరాలకు ప్రభుత్వమే అండగా ఉందన్నారు. పేదలను వెళ్లగొట్టి గాంధీకి మాత్రం అండగా నిలిచారన్నారు. మాకు హద్దులు చూపించడం లేదు.. హద్దులు విషయంలో ఇబ్బందులు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. కాంగ్రెస్‌లో చేరితే ఒక న్యాయం.. ఇతరులకు మరో న్యాయం ఉంటుందా? ఈ షీట్‌లు వేసింది కూడా అధికారులే అని కేటీఆర్ తెలిపారు. కొండాపూర్‌లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్న కొందరికి ప్లాట్లు ఇచ్చారు. వారిని కూడా హైడ్రా వెళ్లగొట్టింది. హైడ్రా చేసేది న్యాయమే అయితే.. అర్ధరాత్రి ఎందుకు వస్తున్నట్లు? నోటీసులు ఇవ్వడానికి ప్రభుత్వానికి ఏంటి ఇబ్బంది? పేపర్లు చూడటానికి ఏం ఇబ్బంది ఉంది? ఇదే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూలగొట్టడం తప్పు అని మాట్లాడారు. తప్పు జరిగితే రెగ్యులరైజ్ చేయండి అని చెప్పంది కూడా రేవంత్ రెడ్డే. ఆర్మీ కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. తెలియక తప్పు జరిగితే సరిదిద్దాలని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు కూలగొడుతున్నారని ప్రశ్నించారు







