Mahaa Daily Exclusive

  కాళేశ్వరంపై విచారణ జరిపిస్తామని మేం హామీ ఇవ్వలేదు…..

Share

  • 420 హామీలపై చర్చకు సిద్ధమా?
  • ముందు ఇచ్చిన హామీల గురించి మాట్లాడండి
  • కాళేశ్వరంపై విచారణ జరిపిస్తామని మేం హామీ ఇవ్వలేదు
  • సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్

హైదరాబాద్, మహా: తమపై అనవసర ఆరోపణలు చేయడం మానుకుని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్‌పై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌ రావు అరెస్టుల సంగతి పక్కనపెట్టి, ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై చర్చకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. “కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన డిక్లరేషన్లు, 420 హామీలపై చర్చకు సిద్ధమా? కాళేశ్వరం కేసుపై విచారణ జరిపిస్తామని మేం ఎన్నికల్లో హామీ ఇవ్వలేదు. ముందు మీరు ఇచ్చిన హామీల గురించి మాట్లాడండి. ఆ తర్వాత మిగతా విషయాలు చర్చిద్దాం” అని అన్నారు. తమకు, బీఆర్ఎస్ మధ్య ఎలాంటి అవగాహనా ఒప్పందం జరగలేదని తేల్చిచెప్పారు. కేసీఆర్ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారని.. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యనే అవగాహన కుదిరిందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంతో పాటు జూబ్లీహిల్స్‌లోనూ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు.

సీఎం రేవంత్ ఏమన్నారంటే..
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఉందని, అందుకే కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీశ్‌రావులను సీబీఐ అరెస్ట్ చేయడం లేదని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నెల 11వ తేదీలోగా వారిద్దరినీ సీబీఐతో అరెస్ట్ చేయించి బీజేపీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఆయన కిషన్‌రెడ్డికి సవాల్ విసిరారు. కేసును సీబీఐకి అప్పగించి మూడు నెలలు గడుస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. ఈ ఆరోపణల నేపథ్యంలోనే కిషన్‌రెడ్డి పైవిధంగా స్పందించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఈ సవాళ్లు, ప్రతిసవాళ్లతో తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కాయి

Latest