Mahaa Daily Exclusive

  బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుందని కవితనే చెప్పారు కదా?

Share

  • బీజేపీకి బీఆర్ఎస్ తాకట్టు..
  • పార్లమెంటు ఎన్నికల్లో ఎనిమిది చోట్ల డిపాజిట్ రాలే
  • బీఆర్ఎస్ ఆత్మహత్య చేసుకుని బీజేపీకి అవయవ దానం చేసింది
  • ఆ రెండు పార్టీల మధ్య రాజకీయ ఒప్పందంతోనే కేసులపై చప్పుడు లేదు
  • బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుందని కవితనే చెప్పారు కదా?
  • బీఆర్ఎస్, బీజేపీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్

హైదరాబాద్, మహా: బీఆర్ఎస్ పార్టీని ఆ పార్టీ అధినేత కేసీఆర్ బీజేపీకి తాకట్టు పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఎనిమిది చోట్ల డిపాజిట్ రాలేదని, బీఆర్ఎస్ ఆత్మహత్య చేసుకుని బీజేపీకి అవయవ దానం చేసిందని సెటైర్లు వేశారు. బుధవారం సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, పాస్టర్స్ కలిశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు లక్ష్మీకాంత రావు, శ్రీ గణేష్, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్, ఏఐసీసీ మైనార్టీ విభాగం ఉపాధ్యక్షుడు అనిల్ థామస్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి పాస్టర్స్ తీసుకురాగా.. రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పాస్టర్స్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం కోసం పనిచేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. భారత్ జోడో పాదయాత్ర ద్వారా రాహుల్ గాంధీ దేశంలోని మైనార్టీలకు ఒక భరోసా ఇచ్చారని గుర్తు చేశారు.

మోదీకి మద్దతు ఇస్తున్న కేసీఆర్ ప్రమాదకరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కారు గుర్తుకు ఓటేస్తే కమలం గుర్తుకు వేసినట్లే కామెంట్స్ చేశారు. జూబ్లీహిల్స్‌లో మైనార్టీలను మభ్యపెట్టడానికి కుట్ర జరుగుతోందని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం అవినీతి కేసును సీబీఐకి అప్పగించి మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు స్పందించలేదని అన్నారు. ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రాజకీయ ఒప్పందం లేకపోతే ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు? అని ప్రశ్నించారు. దేశం కోసం సర్వం త్యాగం చేసిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఈడీ ఆఫీసుకు పిలిచి విచారణ చేశారని పేర్కొన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావును మాత్రం విచారణ కు పిలవడం లేదని, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అయ్యే పరిస్థితి ఉందని, గతంలో కవితనే ఈ విషయాన్ని స్పష్టం చేసిందని గుర్తు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసేందుకు జూబ్లీహిల్స్‌ను ప్రయోగశాలగా చూస్తున్నారన్నారు. కేసీఆర్ మంత్రి వర్గంలో ఒక్క దళితుడే మంత్రిగా ఉన్నాడని, తమ మంత్రి వర్గంలో నలుగురు దళితులకు మంత్రులుగా అవకాశం కల్పించామన్నారు. అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ కి అవకాశం ఇచ్చామని, అత్యంత నిరుపేదలకు సంక్షేమ కార్యక్రమాలు అందించాలన్నదే కాంగ్రెస్ పార్టీ విధానమని అన్నారు. జూబ్లీహిల్స్‌లో మోదీ, కేసీఆర్ ఒక వైపు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మరో వైపు నిలబడ్డారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు

Latest