Mahaa Daily Exclusive

  రాష్ట్ర ఖజానాకు కాసుల గల గల… జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ ముందంజ…

Share

  • రాష్ట్ర ఖజానాకు కాసుల గల గల
  • జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ ముందంజ
  • 10 శాతం వృద్ధి, దేశంలోనే టాప్ సెకండ్ స్టేట్‌గా రికార్డ్

హైదరాబాద్, మహా : సవరించిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేట్ల కారణంగా వస్తువుల ధరలు దిగివచ్చాయి. కొన్ని వస్తువులపై జీఎస్టీని పూర్తిగా తొలగించగా మరికొన్నింటి శ్లాబులు తగ్గించారు. అయితే దీనివల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నులు తగ్గుతాయని నష్టాలు కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేశారు. అయితే జీఎస్టీ పన్ను రేట్లు తగ్గినా.. వసూళ్లు మాత్రం తగ్గట్లేదు. జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ వల్ల లబ్ధి పొందిన అతిపెద్ద రాష్ట్రాలలో తెలంగాణ ఒకటిగా నిలిచింది. తాజా ‘ఎకోరాప్‌’ నివేదిక ప్రకారం.. జీఎస్టీ వసూళ్లలో అనూహ్య వృద్ధిని నమోదు చేసి దేశంలోనే రెండో స్థానం దక్కించుకుంది. జీఎస్టీ రేట్ల పునర్వ్యవస్థీకరణ తర్వాత ఆదాయంలో 7 శాతం నష్టాన్ని అంచనా వేసిన తెలంగాణ రాష్ట్రం.. దానికి భిన్నంగా 10 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2025 అక్టోబర్ నెలలో తెలంగాణ జీఎస్టీ ద్వారా రూ. 5,726 కోట్లు వసూలు చేసింది. ఇది అంతకు ముందు సంవత్సరం (2024 అక్టోబర్) వసూలు చేసిన రూ.5,211 కోట్లతో పోలిస్తే 10 శాతం అధికం. రాష్ట్రం అంచనా వేసిన నెలవారీ రూ. 583 కోట్ల నష్టానికి బదులు.. ఏకంగా రూ.783 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. ఎకోరాప్‌ నివేదిక ప్రకారం.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ 8–9 శాతం వార్షిక జీఎస్టీ వృద్ధి రేటును నమోదు చేసే అవకాశం ఉంది.

ఈ జాబితాలో కర్ణాటక 10 శాతం వృద్ధితో అగ్రస్థానంలో నిలవగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కూడా తెలంగాణకు సమానంగా 8–9శాతం వృద్ధిని సాధిస్తుందని అంచనా. కర్ణాటక రాష్ట్రం నెలవారీ రూ. 7,083 కోట్ల నష్టాన్ని అంచనా వేసినా అది కూడా 10 శాతం వృద్ధిని చూసింది. పంజాబ్ 4 శాతం వృద్ధిని నమోదు చేసింది. పశ్చిమ బెంగాల్‌లో స్వల్పంగా 1 శాతం క్షీణత కనిపించగా కేరళలో జీఎస్టీ ఆదాయం 2 శాతం తగ్గింది.

బడ్జెట్ అంచనాలను మించే అవకాశం

జీఎస్టీ కౌన్సిల్ డేటా ప్రకారం ధరల సవరణల తర్వాత చాలా రాష్ట్రాలు సానుకూల వృద్ధిని కనబరిచాయి. దేశీయ జీఎస్టీ వసూళ్ల అంచనాల ఆధారంగా చూస్తే రాష్ట్రాలు అక్టోబర్ 2025లో చూపిన వృద్ధిని ఇలాగే కొనసాగిస్తే 2025-26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం జీఎస్టీ ఆదాయాలు కేంద్ర బడ్జెట్‌లో అంచనా వేసిన ప్రొజెక్షన్లను మించిపోయే అవకాశం ఉందని ఎకోరాప్ నివేదిక పేర్కొంది. గతంలో 2018 జూలై, 2019 అక్టోబర్ నెలల్లో జీఎస్టీ రేట్ల మార్పుల తర్వాత కూడా స్వల్ప సర్దుబాటు దశ అనంతరం ఆదాయాలు నెలవారీ 5-6 శాతం వృద్ధి చెందాయని నివేదిక గుర్తు చేసింది. ప్రస్తుత రేట్ల తగ్గింపు వల్ల స్వల్పకాలంలో 3–4 శాతం క్షీణత ఉన్నప్పటికీ.. మొత్తం జీఎస్టీ పన్ను పరిధిని బలోపేతం చేసిందని, భవిష్యత్తులో స్థిరమైన వృద్ధికి ఇది మార్గం సుగమం చేస్తుందని నివేదిక వెల్లడించింది

Latest