- ఆలయాలల్లో కార్తీక శోభ..
- కార్తీక పౌర్ణమి వేళ దివ్య కాంతుల్లో ఆలయాలు
- వేయి స్తంభాల ఆలయానికి పోటెత్తిన భక్తులు
- శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో వైభవంగా వేడుకలు
- శివన్నామస్మరణతో మార్మోగిన వేములవాడ రాజన్న ఆలయం
హైదరాబాద్, మహా: కార్తీక పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. బుధవారం తెల్లవారుజాము నుంచే శివాలయాలకు భక్తులు పోటెత్తారు. భద్రాచలం వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి దీపాలను నీటిలో వదిలారు. హనుమకొండలోని చారిత్రత్మాక వేయిస్తంభాల ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శ్రీ రుద్రేశ్వరుడి దర్శనార్థం బారులు తీరారు. ఉదయాన్నే స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు కార్తిక దీపాలు వెలిగించారు. హనుమకొండలోని వేయి స్తంభాల గుడి ఆవరణ కార్తీక దీప కాంతులతో ధగధగా వెలిగిపోయింది. కార్తిక పౌర్ణమిని పురస్కరించుకొని పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలి వచ్చారు. రుద్రేశ్వరస్వామిని దర్శించుకుని పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా పలు దేవాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. వేములవాడ పార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం, భీమేశ్వరాలయం, భీమేశ్వరసదన్ బుధవారం కార్తీక దీపకాంతుల్లో వెలిగిపోయాయి. చిన్నాపెద్ద తేడా లేకుండా పెద్ద సంఖ్యలో నేతివత్తులతో దీపాలు వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు వేలాది మంది భక్తులు పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రంతో ఆలయం మార్మోగింది. వేకువజాము నుంచే భక్తులు అధికసంఖ్యలో ధర్మగుండంలో స్నానాలు ఆచరించి కార్తీకదీపాలు వెలిగించుకున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం రాత్రి భీమేశ్వరసదన్లో లక్ష దీపోత్సవ కార్యక్రమం నిర్వహించగా.. జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం రాజన్న ఆలయ ముందు భాగంలో జ్వాలాతోరణం కనుల పండుగా జరిపారు. అలాగే ప్రముఖ జ్యోతిర్లింగం, శక్తి పీఠమైన భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం శ్రీశైలంలో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. పౌర్ణమి సందర్భంగా సాయంత్రం ఆలయం ఎదుట గంగాధర మండపం వద్ద జ్వాలాతోరణోత్సవం నిర్వహించారు








