Mahaa Daily Exclusive

  డయాబెటిస్‌ ఉంటే అమెరికా వీసా కష్టమే :డొనాల్డ్‌ ట్రంప్‌ మరో కొత్త రూల్

Share

ఇంటర్నెట్ డెస్క్, మహా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో కొత్త రూల్ తీసుకొచ్చారు. డయాబెటిస్‌, ఒబెసిటీ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి వీసాలను తిరస్కరించాలనే కొత్త నిబంధనలను రూపొందించారు. ఈ మేరకు అమెరికా ఎంబసీలు, కాన్సులర్‌ కార్యాలయాలకు అగ్రరాజ్య విదేశాంగ శాఖ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. సాధారణంగా అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారి ఆరోగ్య స్థితిని ఇమిగ్రేషన్‌ అధికారులు పరిశీలిస్తారు. టీబీ వంటి అంటు వ్యాధులు ఉన్నాయో లేదో స్క్రీనింగ్‌ చేస్తారు. ఈ నిబంధనలను తాజాగా సవరించారు. మరిన్ని వ్యాధులను ఈ జాబితాలో చేరుస్తూ మార్గదర్శకాలు రూపొందించారు. ‘దరఖాస్తుదారుల ఆరోగ్యాన్ని కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుుంది. హృద్రోగ సమస్యలు, శ్వాస సంబంధిత వ్యాధులు, క్యాన్సర్‌, డయాబెటిస్‌, జీవక్రియ, నాడీ సంబంధిత వ్యాధులు, మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడేవారిని సంరక్షించాలంటే లక్షల డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే వలసదారుల ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి వారు ప్రభుత్వ వనరులపై ఆధారపడుతారో లేదో గుర్తించాలి. ఒకవేళ అలాంటి వారైతే అమెరికాలోకి ప్రవేశాన్ని తిరస్కరించాలి’ అని ఆ మార్గదర్శకాల్లో వెల్లడించారు.