ఢిల్లీ, మహా: ప్రపంచంలో అణ్వాయుధాలను పరీక్షిస్తున్న దేశాల్లో పాకిస్థాన్ కూడా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై భారత్ స్పందించింది. ఆ వ్యాఖ్యలను నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది. రహస్యంగా, చట్టవిరుద్ధంగా అణు కార్యకలాపాలు కొనసాగించడంలో పాకిస్థాన్‌కు దశాబ్దాల చరిత్ర ఉందని స్పష్టం చేసింది. స్మగ్లింగ్, ఎగుమతి నియంత్రణ ఉల్లంఘనలు, రహస్య భాగస్వామ్యాలు దశాబ్దాలుగా పాకిస్థాన్‌కు అలవాటేనని, ఏకే ఖాన్ నెట్‌వర్క్ విస్తరణ చుట్టూ ఇది కేంద్రీకృతమైందని భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు. ఈ అంశాలను అంతర్జాతీయ సమాజం దృష్టికి భారత్ ఎల్లప్పుడూ తీసుకెళ్తూనే ఉంటుందన్నారు. వచ్చే ఏడాది భారత్‌లో పర్యటిస్తానని ట్రంప్ చేసిన ప్రకటన గురించి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. దీనిపై ప్రస్తుతానికి తమకు ఎటువంటి సమాచారం లేదన్నారు. ప్రపంచంలో చాలా దేశాలు చురుగ్గా అణ్వాయుధాలను పరీక్షిస్తున్నాయని, ఆ జాబితాలో పాకిస్థాన్ ఉందని అమెరికా అధ్యక్షుడు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. రష్యా, చైనా, ఉత్తరకొరియా, పాకిస్థాన్ వంటి దేశాలు అణు పరీక్షలను నిర్వహిస్తున్నాయని, వాళ్లనెవ్వరూ ప్రశ్నించరని అన్నారు








