- చంచల్ గూడ జైల్లో తన్నుకున్న రౌడీలు తీవ్ర ఉద్రిక్తత
- గాయపడ్డ ఱైదీలను ఆస్పత్రికి తరలించిన అధికారులు
హైదరాబద్, మహా : చంచల్ గూడ జైలులో ఇద్దరు రౌడీషీటర్లు తన్నుకున్నారు. రౌడీల పరస్పర దాడిలో జైలు ములాఖత్ గది అద్దాలు ధ్వంసమయ్యాయి. దాడిలో రౌడీలు ఇద్దరు గాయాలపాలయ్యారు. రౌడీల దాడితో జైలులోని ములాఖత్ గదితో పాటు పరిసరాలు దద్దరిల్లాయి. ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితులలో జైలు సిబ్బందితో పాటు కొంత మంది ఖైదీలు నివ్వెర పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బుధవారం సాయంత్రం సరిగ్గా 4.30కి ఖైదీలు తమ బంధువులను కలిసే ములాఖత్ రూమ్ వద్ద ఒక్కసారిగా ఘర్షణకు దిగారు. ఓ నేరంపై మంగళవారం జైలుకు వచ్చిన ఖైదీ జాబ్రీపై మరో పాత ఖైదీ దస్తగిరి పరస్పరం దాడికి దిగారు. ఈ పెనుగులాటలో ఖైదీ జాబ్రీకి తీవ్రంగా గాయాలయ్యాయి. హఠాత్ పరిణామం తర్వాత తేరుకున్న జైలు అధికారులు పరిస్థితిని చక్కదిద్ది గాయపడ్డ ఖైదీలను వేర్వేరు ఆస్పత్రులకు చికిత్స నిమిత్తం తరలించారు. గొడవకు కారణం ఏమిటి, రౌడీల మధ్య ఉన్న పాత గొడవలు ఏమిటన్న విషయంపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.








