- మొక్కజొన్న రైతులను ఆదుకోవాలి
- కౌలు రైతుల మక్కలను ప్రభుత్వమే కొనాలి
- సీఎం కు లేఖ రాసిన బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి
హైదరాబాద్, మహా : మొక్కజొన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, కౌలు రైతులు పండించిన మొక్కలను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలని బీజేపీ ఎమ్మెల్సీ డా. చిన్న మైల్ అంజిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయగా, ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, జిల్లాల పరిధిలో 3.20 లక్షల మంది రైతులు సాగు చేసారని, ఇందులో కొంతమంది కౌలు రైతులు మొక్కజొన్నలను పండించారని పేర్కొన్నారు. క్రాప్ సర్వేలో పంట నమోదు కాలేదన్న కారణంతో మార్కెట్ యార్డ్ కు తెచ్చిన మక్కలను కొనుగోలు చేయడం లేదన్నారు. దీంతో రైతుల శ్రమను దళారులు దోచుకుంటున్నారని తెలిపారు. కౌలు రైతులు దళారులకు రూ. 1700కు అమ్ముకోవడం జరుగుతుందన్నారు. ‘ప్రతీ ఎకరానికి 18 క్వింటాళ్లు మాత్రమే మక్కలు కొంటాం అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు కోతలు పెడుతున్నారు. పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలి. క్వింటాలుకు రూ. 2400 మద్దతు ధరతో పాటు కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెల్లిస్తామన్న రూ. 330 బోనస్ ను రైతులకు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అడ్డికి పావుశేరు చొప్పున రైతులు అమ్ముకునే దుస్థితి ఏర్పడింది. మక్క రైతులకు తీవ్ర నష్టం వాటిల్లి వారి కష్టమంతా దళారుల పాలవుతున్నది. మొక్కజొన్నకు కనీస మద్దతు ధర క్విoటాల్ కు 2400 రూపాయలు కౌలు రైతులు పండించిన పంటలను కూడా మద్దతుధర అందించి, ప్రభుత్వమే కొనుగోలు చేయాలనీ డిమాండ్ చేస్తున్నాం’ అని ఎమ్మెల్సీ అంజిరెడ్డి డిమాండ్ చేశారు.





