- మేడారం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్
- అభివృద్ధి తట్టుకోలేక అబద్ధపు ప్రచారం చేస్తున్నారు
- కోట్లాది నిధులతో పనులు చేపడుతుంటే సహించలేకపోతున్నారు
- పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ఫైర్
ములుగు, మహా: కాంగ్రెస్ హయాంలో ములుగు నియోజకవర్గంలో సాగుతున్న అభివృద్ధి పనులను చూసి తట్టుకోలేక కొందరు నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించారు తప్ప, నియోజకవర్గ అభివృద్ధిని, ప్రజా సమస్యలను కనీసం పట్టించుకోలేదని మండిపడ్డారు. చివరికి ఆదివాసీల ఆరాధ్య దైవాలైన వనదేవతలు సమ్మక్క, సారలమ్మలు కొలువైన మేడారం శాశ్వత అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించి కోట్లాది నిధులతో పనులు చేపడుతుంటే సహించలేక పోతున్నారని విమర్శించారు. మేడారం అభివృద్ధిపై తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. వారు చేయలేని పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే తట్టుకోలేక దేవతల అంశాలను స్వార్ధ ప్రయోజనాల కోసం రాజకీయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎవరేమనుకున్నా ములుగు అభివృద్ధి నా లక్ష్యం..
గురువారం ములుగులో పలు అభివృద్ధి పనులను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో మంత్రిగా తాను నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి అభివృద్ధిని కొనసాగిస్తుంటే జీర్ణించుకోలేక పోతున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. ప్రజలను, వారి పార్టీ శ్రేణులను సైతం తప్పుదోవపట్టిస్తున్నారని అన్నారు. ఎవరేమనుకున్నా ములుగు నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యమన్నారు. ములుగును అన్ని రంగాల్లో ముందంజలోకి తెచ్చి, పరుగులు పెట్టించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నానన్నారు. తప్పుడు ప్రచారం, ఆరోపణలతో తాత్కాలికంగా మభ్యపెడుతున్న వారికి నియోజకవర్గ ప్రజలే తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు. ఇప్పటికైనా తప్పుడు ఆరోపణలు, ప్రచారం చేసే వారు తమ బుద్ది మార్చుకోవాలని లేకుంటే కాంగ్రెస్ శ్రేణులు సైతం గట్టి సమాధానం చెబుతారని సీతక్క అన్నారు.








