Mahaa Daily Exclusive

  మోసం చేయడమే హరీష్ నైజం:తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

Share

  • మోసం చేయడమే హరీష్ నైజం
  • ఆయన ద్రోహం వల్లే జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ ఓటమి
  • జగదీశ్‌రెడ్డి, మదన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డికి వందల కోట్లు ఎక్కడివి?
  • కృష్ణార్జునులు అంటారు… ఒకరిపై ఒకరు కేటీఆర్, హరీష్ బాణాలు వేసుకుంటారు
  • తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు

మెదక్, మహా: బీఆర్ఎస్ లో కృష్ణార్జునులం అంటూ కేటీఆర్, హరీష్ రావులు ట్వీట్లు పెట్టుకుని పరస్పరం సొంత డబ్బాలు కొట్టుకుంటున్నారు గాని..ప్రతిపక్ష నాయకులుగా ప్రజల అంచనాల మేరకు వారు పనిచేయడం లేదని, అందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ భారీ మెజార్టీతో ఓడిపోయిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ బహిష్కృత నేత కల్వకుంట్ల కవిత విమర్శించారు. మెదక్ జిల్లా జనం బాట కార్యక్రమంలో భాగంగా మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ వాళ్లు సోషల్ మీడియాలో ఉద్యమం చేస్తున్నారు తప్ప ప్రజాక్షేత్రంలో పని చేయడం లేదన్నారు. నిజంగానే బీఆర్ఎస్ నేతలు ప్రజల కోసం పని చేసి ఉంటే జూబ్లీహిల్స్ ఫలితాలు మరొలా ఉండేవన్నారు. ప్రతిపక్ష పార్టీ ప్రజల కోసం పనిచేయలేని గ్యాప్ ను తెలంగాణ జాగృతి అందుకుని ప్రజాక్షేత్రంలో ప్రజాసమస్యలపై పోరాడుతుందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ఓటమికి చాల కుట్రలు జరిగాయని..సమయం, సందర్బం వచ్చినప్పుడు వెల్లడిస్తానని కవిత చెప్పుకొచ్చారు. హరీష్, గంగుల, నవీన్ రావుల కోసం మారిన త్రిబుల్ ఆర్ ఆలైన్ మెంట్ రెడ్డిపల్లి గ్రామంలో కాళేశ్వరంలో భూములు పోయి నష్టపోయిన రైతులు త్రిబుల్ ఆర్ లో మరోసారి భూములు పోతున్నాయని, రైల్వే లైన్ లో మరికొందరి భూములు పోయే ప్రమాదం ఉందని కవిత తెలిపారు. రెడ్డిపల్లిలో 56మంది రైతులకు చెందిన ఎకరం, అర ఎకరం భూములు 59ఎకరాలు పోతున్నాయన్నారు. రెడ్డిపల్లికి రాగానే త్రిబుల్ ఆర్ అనేక వంకలు తిప్పిన తీరు చూస్తేనే కొందరి పెద్దల కోసం అలైన్ మెంట్ మార్చారని అందరికి అర్ధమైపోతుందన్నారు.

హరీష్ రావు 400 ఎకరాల భూముల కోసమే..
హరీష్ రావు 400 ఎకరాల భూములు, ఫామ్ హౌస్, గంగుల కమలాకర్ 15 ఎకరాల భూముల కోసం, ఎమ్మెల్సీ నవీన్ రావు 18 ఎకరాల భూముల కోసం త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ మార్చారని కవిత ఆరోపించారు. ఇదే విషయాన్ని ఇక్కడి రైతులు వెల్లడించారని తెలిపారు. ఇట్లాంటి విషయాలు కేసీఆర్ తెలిస్తే ఊరుకునేవారు కాదని..కేసీఆర్ కళ్లకు గంతలు కట్టి ఇలాంటి పనులు చేసినందుకే మెదక్ లో బీఆర్ఎస్ ఓడిపోయిందన్నారు. నర్సాపురంలో స్టేట్ హైవే పక్కన మడిగెలలో ఎస్టీ బాలుర హాస్టల్ నిర్వహిస్తున్నారని , పిల్లలను కాపాడుకోవడం టీచర్లకు కష్టంగా మారిందని..ఆ మడిగలకు మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి నెలకు రూ.1లక్ష 50వేలు వస్తున్నందునా వాటిలో హాస్టల్ నిర్వహిస్తున్నారని కవిత ఆరోపించారు. ప్రభుత్వం పిల్లల సంక్షేమం కోసం హాస్టల్ భవనం మార్చాలని, కొత్తది నిర్మించాలని డిమాండ్ చేశారు. మెదక్ సమస్యలపై హరీష్ రావు నిర్లక్ష్యం రెడ్డిపల్లి భూ నిర్వాసిత రైతులకు కోటి రూపాయల చొప్పున ఇవ్వాలని లేదా కాళేశ్వరం కాలువ పరిధిలోని 150 ఎకరాల్లో భూమికి బదులుగా భూమి ఇవ్వాలన్న రైతుల కోరికను ప్రభుత్వం ఆమోదించాలని కవిత డిమాండ్ చేశారు. ఏడుపాయల వనదుర్గ ఆలయ పరిరక్షణకు ఘన్ పూర్ ఆనకట్టు ఎత్తును పెంచాలని, హరీష్ రావు మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం 2016లో 43కోట్ల రూపాయలు మంజూరు చేసిన్పటికి పనులు ఎందుకు పూర్తి చేయలేదో ఆయన ప్రజలకు సమాధానం చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. మెదక్ లో కాళేశ్వరం మూడు ప్యాకెజీలు మొదలు పెట్టి 2,562కోట్లకు 991కోట్లు ఇచ్చారని, భూములు తీసుకుని నీళ్లివ్వడం లేదని, డబ్బులు ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారన్నారు. మెదక్ లో పదేళ్లుగా పెద్ద నాయకులు ఉన్నా ఎందుకు ఆ సమస్యలు పరిష్కారం కాలేదో వారే చెప్పాలన్నారు. పిల్లకొట్టాల వద్ద కేసీఆర్ హాయంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ కాలనీకి కేసీఆర్ కాలనీ పేరు కొనసాగించాలని కవిత కోరారు. రోడ్లు, శ్మశాన వాటిక, ప్రార్ధన మందిరాలు, డ్రైనేజీలు ఇక్కడ లేవని..ఇళ్లను అనర్హులకు ఇవ్వడంతో తాళాలు వేసి ఉంటున్నాయని స్థానికులు చెబుతున్నారన్నారు. పద్మా దేవేందర్ రెడ్డి ఏనాడు ఉద్యమకారులను పట్టించుకోలేదని, దీనిపై ఆమె ఆలోచించుకోవాలన్నారు. మెడికల్ కాలేజీకి, నర్సింగ్ కాలేజీకి, వాటి హాస్టల్స్ భవనాలకు నిధులు మంజూరైన నిర్మాణాలు లేవని..ఇదే అదనుగా సీఎం రేవంత్ రెడ్డి మెడికల్ సీట్లను తన జిల్లాకు తరలించుకుపోవడం విచారకరమన్నారు. కాళేశ్వరం నీళ్లు రాలే…హరీష్ రావు సమాధానం చెప్పాలి మెదక్ లో కాళేశ్వరం కింద లక్ష 50వేల ఎకరాలకు నీరు రావాలని, ఒక్క ఎకరానికి కూడా నీరు రాలేదని, నిజాం కాలంలో కట్టిన ఘన్ పూర్ ప్రాజెక్టు నీళ్లు మాత్రమే నేటికి దిక్కయ్యిందని కవిత తెలిపారు. ఇక్కడ గోదాంలు లేవని, నాలుగు మున్సిపాల్టీలకు నిధులిచ్చిన పనులు జరుగలేదని వీటన్నింటికి హరీష్ రావు సమాధానం చెప్పాలన్నారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేసినా..ఇక్కడి అభివృద్ధి మౌలిక వసతులు ఏర్పాటు కాలేదన్నారు.

కేసీఆర్ కళ్లకు గంతలు కట్టి..
కేసీఆర్ కళ్లకు గంతలు కట్టి మెదక్ జిల్లాను నాశనం చేసిన హరీష్ రావు ఇందుకు జవాబు చెప్పాలన్నారు. మెదక్ జిల్లా సమస్యలు తెలిస్తే కేసీఆర్ ఊరుకునే వ్యక్తి కాదన్నారు. మెదక్ అంటే న్యూయార్కు అనుకున్నాగాని హరీష్ రావు వంటి నాయకుడున్న ఇన్ని సమస్యలు ఉండడం ఆశ్చర్యకరమన్నారు. జాగృతి జనం బాట సామాజిక తెలంగాణ సాధన దిశగా కొనసాగుతుందని కవిత తెలిపారు. హైదరాబాద్ తో పాటు గ్రామీణ ప్రాంతాల ప్రజల తలసరి ఆదాయం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. గ్రూప్ 1 ఉద్యోగాల్లో అన్యాయం చేస్తున్నారని, ప్రభుత్వ శాఖలలో ఉద్యోగాలు భర్తీ చేయకుండా, ఉద్యోగాలంటే గ్రూప్స్ ఒక్కటే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మెదక్ పాడి రైతులకు అన్యాయం చేసిన హరీష్ రావు మెదక్ జిల్లా పాడి రైతులకు మద్దతుగా నిలవాల్సిన మెదక్ జిల్లా నాయకుడు హరీష్ రావు ప్రైవేటుగా పాల వ్యాపారం చేస్తూ బాగుపడ్డారే తప్పా..పాడి రైతులను పట్టించుకోలేదని కవిత విమర్శించారు. సీఎం పీఆర్వో అయోధ్యరెడ్డి గతంలో హరీష్ రావు, ఆయన సతీమణిలు టెండర్లు లేకుండా గురుకులాలకు పాల సరఫరా చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారని గుర్తు చేశారు. అయినా సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు హరీష్ రావు, ఆయన బీనామీలు చేసిన అక్రమాలపై చర్యలు తీసుకోవడం లేదని కవిత ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి, హరీష్ రావుకు మధ్య ఉన్న బంధం, ఒప్పందం ఏమిటో..ఎందుకు ఆయనను కాపాడుతున్నారో సీఎం చెప్పాలని కవిత డిమాండ్ చేశారు.

Latest