కట్టుకథల మాటున రక్తపాతం!
• దండకారణ్యంలో దారుణం.
• హిడ్మా ఎన్‌కౌంటర్ బూటకమే.
• విజయవాడలో బంధీ, మారేడుమిల్లిలో హత్యాకాండ.
• ఫాసిస్ట్ ప్రభుత్వ దమనకాండకు నిదర్శనం.
• చికిత్స కోసం వచ్చిన అగ్రనేతను పట్టుకుని క్రూర హత్య.
• హిడ్మా, శంకర్ సహా 6గురిని కిరాతకంగా చంపారు.
• నవంబర్ 23న దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపు.
• భగత్ సింగ్, అల్లూరి చరిత్రలకు తోడుగా హిడ్మా వీరగాథ.
• పీడిత ప్రజల నాయకుడిపై విష ప్రచారం.
• మావోయిస్ట్ కేంద్ర కమిటీ సంచలన ప్రకటన.
ఖమ్మం బ్యూరో, మహా.
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ విడుదల చేసిన ఒక అత్యంత సంచలనాత్మక పత్రికా ప్రకటన దేశవ్యాప్తంగా రాజకీయ, భద్రతా వర్గాలలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్-తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో జరిగినట్లు ప్రకటించిన ఎన్‌కౌంటర్లను ఈ కమిటీ ఖండించడమే కాక, వాటిని అత్యంత క్రూరమైన బూటకపు హత్యకాండ గా అభివర్ణించింది. కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి అయిన కామ్రేడ్ మాడ్వి హిడ్మా , ఏఓబీ రాష్ట్రకమిటీ సభ్యుడు కామ్రేడ్ శంకర్ సహా మొత్తం ఆరుగురు కీలక నాయకులను పోలీసులు చట్టవిరుద్ధంగా అదుపులోకి తీసుకుని, అమానుషంగా హత్య చేశారని కమిటీ నిప్పులు చెరిగింది. ఈ దారుణ చర్యలకు నిరసనగా నవంబర్ 23న దేశవ్యాప్తంగా నిరసన దినంగా పాటించాలని సీపీఐ (మావోయిస్టు) ప్రజలకు ఉద్విగ్నభరితమైన పిలుపునిచ్చింది.
*విజయవాడలో ద్రోహం, అడవిలో హత్యాకాండ*
పత్రికా ప్రకటనలో వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ మొత్తం ఉదంతం వెనుక ఒక చీకటి కుట్ర దాగి ఉంది. కామ్రేడ్ హిడ్మా, తన సహచరి కామ్రేడ్ రాజే, మరికొంతమంది నాయకులతో కలిసి కేవలం చికిత్స నిమిత్తం నిరాయుధులుగా విజయవాడ నగరానికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న క్రమంలో, లోపలి వ్యక్తుల ద్రోహం కారణంగా వారి కదలికలకు సంబంధించిన స్పష్టమైన సమాచారం పోలీసులకు చేరింది. కేంద్ర హోం మినిస్ట్రీ యొక్క ప్రత్యక్ష ఆదేశాల మేరకే ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐ్బ్బ) రంగంలోకి దిగింది. నవంబర్ 15వ తేదీన వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, లొంగదీసుకునేందుకు ప్రయత్నించి విఫలమైన తర్వాత, అత్యంత క్రూరంగా హత్య చేశారు. ఈ హత్యలను కప్పిపుచ్చుకోవడానికి, అధికార యంత్రాంగం మారేడుమిల్లి అడవుల్లో ఎన్‌కౌంటర్ జరిగిందని, ఆయుధాలు దొరికాయని, ఆరుగురు చనిపోయారని ప్రకటించడం అంతా పచ్చి అబద్ధాల కట్టుకథ అని కేంద్ర కమిటీ ధృవీకరించింది. ఇదే తరహాలో, ఏఓబీ రాష్ట్రకమిటీ సభ్యుడు కామ్రేడ్ శంకర్ సహా మరికొంతమందిని కూడా పట్టుకుని హత్య చేసి, రంపచోడవరం ఏరియాలో ఎన్‌కౌంటర్ జరిగిందనే మరో కట్టుకథను అల్లారని కమిటీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.
*ఫాసిజం నీడలో కార్పొరేట్ అజెండా*
ఈ దారుణ హత్యలు కేవలం వ్యక్తిగత కక్ష సాధింపులు కాదని, ప్రస్తుత దేశంలో ఆర్ఎస్ఎస్ – బీజేపీ మనువాదుల ఫాసిస్టు దమనకాండకు నిదర్శనమని మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటించింది. హత్యలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్న ఫాసిస్టు ప్రభుత్వం, కార్పొరేట్ల ప్రయోజనాలను కాపాడటం కోసమే ఈ రక్తపాతాన్ని సృష్టిస్తోందని ఆరోపించింది. దేశ సంపదను, ప్రకృతి వనరులను కార్పొరేట్లకు అప్పజెప్పడానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజా పోరాటాలన్నింటినీ విచ్ఛిన్నం చేయడానికే ఈ అణచివేత విధానాలను అనుసరిస్తున్నారని కమిటీ పేర్కొంది. ఎన్నికల కమిషన్ సైతం మోదీకి ‘గోది’ కమిషన్‌గా మారిపోయిందని, దేశంలో ప్రతిపక్షాల ఉనికిని సైతం తుడిచిపెట్టేందుకు కుట్ర జరుగుతోందని ప్రకటనలో ఘాటుగా విమర్శించారు.
*చెదరని వీరగాథ పీడిత ప్రజల నాయకుడు హిడ్మా*
బూటకపు హత్యలకు గురైన కామ్రేడ్ హిడ్మాకు, చివరి వరకు ఉద్యమ స్ఫూర్తిని నిలబెట్టిన కామ్రేడ్ శంకర్, కామ్రేడ్ రాజే, కామ్రేడ్ చైతు, కామ్రేడ్ కమూ, కామ్రేడ్ మల్లాల్, కామ్రేడ్ దేవేలకు సీపీఐ (మావోయిస్టు) శిరస్సు వంచి వినమ్రంగా శ్రద్ధాంజలి ఘటించింది.
చత్తీస్‌గఢ్‌లోని సుక్కా జిల్లాలో పేద ఆదివాసీ కుటుంబంలో జన్మించిన హిడ్మా, దండకారణ్య ఉద్యమంలో అంచలంచెలుగా ఎదిగారు. చిన్న వయసులోనే బాసగూడ దళంలో చేరి, మిలిటరీ రంగంలో అపారమైన అనుభవాన్ని గడించారు. మిలిటరీ చర్యలకు మెరుగైన పథక రచనలు చేసి, వందలాది ఆయుధాలను స్వాధీనం చేసుకుని పీఎల్జీఏను సాయుధం చేయడంలో ఆయన పాత్ర అద్వితీయమైనది. ఆయన నాయకత్వంలోనే దక్షిణ సబ్ జోన్‌లో ‘జనతన సర్కార్లు’ నిర్మాణమయ్యాయి. పాలకవర్గ మీడియా హిడ్మాను ఎంతగా దుర్మార్గుడిగా చిత్రీకరించడానికి ప్రయత్నించినా, ప్రజల గుండెల్లో ఆయన స్థానం ఎప్పటికీ చెరిగిపోనిదని కేంద్ర కమిటీ ఉద్ఘాటించింది. భగత్ సింగ్, కొమురం భీం, అల్లూరి సీతారామరాజుల చరిత్ర లాగానే, హిడ్మా చరిత్ర కూడా భారత విప్లవోద్యమంలో చెరగని ముద్ర వేస్తుందని, ఆయన కేవలం ఆదివాసీ సముదాయానికి మాత్రమే కాక, పీడిత ప్రజలందరికీ నాయకుడిగా చరిత్రలో నిలిచిపోతారని ప్రకటన ముగించింది. ఆయన కొనసాగించిన విప్లవ సాంప్రదాయాలను, స్ఫూర్తిని నింపుకుని ఉద్యమాన్ని కొనసాగిస్తామని కేంద్ర కమిటీ శపథం చేసింది.








