- మంగళవారం కేబినెట్ భేటీ
- డెడికేటెడ్ కమిషన్ సిఫార్సులు ఆమోదించనున్న మంత్రివర్గం
- యాదగిరిగుట్ట దేవాలయ పాలక వర్గానికి ఆమోదం తెలపనున్న సమావేశం
హైదరాబాద్, మహా : తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఈ నెల 25 వ తేదీ (మంగళవారం) జరగనుంది. సచివాలయంలో ఉదయం గం. 11 లకు జరుగనున్న భేటీలో డెడికేటెడ్ కమిషన్ సిఫార్సులకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనున్నట్లు సమాచారం. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా ఉండేలా చూడాలని కమిషన్ సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. బీసీలకు 42 శాతం కోటాపై కోర్టులో వివాదాలు ఉన్నందున పాత పద్ధతిలోనే పంచాయతీల ఎన్నికలు జరపాలని ఈ నెల 17న జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా సిఫార్స్ చేయాలన్న కేబినెట్ సూచన మేరకు బూసాని వెంకటేశ్వర రావు సారథ్యంలోని డెడికేటెడ్ కమిషన్ పంచాయతీలు, వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కోటాలను సిఫార్స్ చేస్తూ గురువారం సీఎస్‌కు నివేదిక సమర్పించింది. ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం, బీసీలకు కులగణన డేటా ప్రకారం 50 శాతం కోటా మించకుండా సిఫార్స్ చేసినట్లు సమాచారం.
డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా పంచాయతీరాజ్ శాఖ గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేయనుంది. ఎంపీడీవోలు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో లాటరీ ద్వారా మహిళా రిజర్వేషన్లు ప్రకటించనున్నారు. ఈ నెల 24న జరిగే హైకోర్టు విచారణకు ముందే ఈ ప్రక్రియ పూర్తయ్యేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేస్తే ఈ నెల 24న హైకోర్టులో విచారణ పూర్తికాగానే అదే రోజు లేదా మరుసటి రోజు షెడ్యూల్ ప్రకటించాలని ఎస్ఈసీ భావిస్తోంది. 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రణాళిక సిద్ధం చేసింది. డిసెంబరు 17 వరకు వార్డు సభ్యులు, సర్పంచ్ల ఎన్నికలు పూర్తి చేసేలా కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో 12 వేల 733 పంచాయతీలు, లక్షా 12 వేల 288 వార్డులు ఉన్నాయి. మధ్యాహ్నం వరకు పోలింగ్ నిర్వహించి, అదేరోజున ఫలితాలు ప్రకటించేలా ఎస్ఈసీ ఏర్పాట్లు చేస్తోంది.
డెడికేషన్ కమిషన్ సిఫార్సులకు ఆమోదం తెలపడంతో పాటు యాదగిరిగుట్ట దేవాలయానికి పాలక మండలిని ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. డిసెంబర్లో జరుగనున్న తెలంగాణ రేజింగ్ సమ్మిట్ కు సంబంధించిన అంశంపై సమావేశం చర్చించనుంది.








