- కేటీఆర్..అసత్యాలు చెప్పడం మానండి
- అడ్డగోలు జీవోలు, చెల్లింపులు మా హయాంలో లేవు
- పెట్టుబడులు రాకూడదు, జరగకూడదు ఇదే నీ ఆలోచనా?
- ఆధారాలు ఉంటే చెప్పండి.. చర్యలు తీసుకుంటాం
- మాజీ మంత్రి కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
హైదరాబాద్, మహా: పదేళ్లు మంత్రిగా పనిచేసిన కేటీఆర్ రాష్ట్ర ప్రజలకు అసత్యాలు చెబుతున్నారని రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు తీవ్రంగా విమర్శించారు. గత ప్రభుత్వం మాదిరిగా తమ ప్రభుత్వం అడ్డగోలుగా జీవోలు, చెల్లింపులు చేయడం లేదని, వారి హయాంలో ఏం చేసినా దాని వెనుక ఏదో మతలబు ఉండేదని ఆరోపించారు. తమ కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలపై కేటీఆర్ ఆరోపణలు చేశారని, మొత్తం 9,292 ఎకరాల భూమి గురించి మాట్లాడుతున్నారని మంత్రి అన్నారు. పరిశ్రమలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం భూములను తక్కువ ధరకు ఇస్తోందని స్పష్టం చేశారు. ఫ్రీహోల్డ్, ల్యాండ్ లీజ్‌కు తేడా లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారని, 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన జీవో ప్రకారమే భూములు ఇస్తున్నామని, భూమి హక్కులు ఉన్న వారికి మేలు చేయాలని చూస్తున్నామని తెలిపారు.
నూతన పాలసీ విధానం చట్టబద్ధంగా జరుగుతుంది..
పెట్టుబడులు రావాలనే లక్ష్యంతోనే తమ ప్రభుత్వం రాయితీలతో కూడిన పాలసీలు తీసుకుంటుందని మంత్రి అన్నారు. గత ప్రభుత్వం హయాంలో చాలా భూములు బదిలీ అయ్యాయని, పరిశ్రమలకు ఉపయోగపడాలని గ్రిడ్ పాలసీ తీసుకున్నారని అనుకున్నామని గుర్తు చేశారు. కేటీఆర్ కొంత మంది పేర్లు చెప్పారని, వారు ప్రభుత్వంలో లేరని, ఆధారాలు ఉంటే చెప్పాలని, చర్యలు తీసుకుంటామని శ్రీధర్‌బాబు సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నేతలు అభూత కల్పనలతో రాష్ట్ర ప్రజలకు సత్యదూరమైన మాటలు చెబుతున్నారని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి తర్వాత ఆ పార్టీ నేతలకు పగలే చుక్కలు కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. పెట్టుబడులు రాకూడదు, రాష్ట్ర అభివృద్ధి జరగకూడదు అనేది కేటీఆర్ ఆలోచనగా కనిపిస్తోందని మంత్రి విమర్శించారు. ఇంపాక్ట్ ఫీజు, కన్వర్షన్ ఫీజు విషయంలో 80 అడుగుల కంటే తక్కువ ఉన్న పరిశ్రమ భూములపై 30 శాతం, 50 శాతం నిర్ణయం చేశామని తెలిపారు. పరిశ్రమలను ప్రోత్సహించాలనే దృఢ సంకల్పంతో ఉన్న ప్రభుత్వం, టీజీఐపాస్ ద్వారా మొదట 20 శాతం, మిగిలిన 80 శాతం తర్వాత చెల్లించే విధానాన్ని అమలు చేస్తుందని అన్నారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని, నూతన పాలసీ విధానం చట్టబద్ధంగా జరుగుతుందని, దరఖాస్తుదారులు ఆరు నెలల్లోపు దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి వివరించారు.
=========================








