- కేటీఆర్‌కు పచ్చకామెర్లు సోకాయి
- బీఆర్ఎస్ హయాంలో సాగింది ఫాం హౌస్ పాలనే
- ఎన్నికల్లో ఓడినా కేటీఆర్‌కు ఇంకా బుద్ధి రాలేదు
- కేటీఆర్‌కు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్
హైదరాబాద్, మహా: మాజీ మంత్రి కేటీఆర్‌కు కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పచ్చ కామెర్లు వచ్చిన వారికి లోకం అంతా పచ్చగానే కనపడుతోందని.. కేటీఆర్‌కి కూడా అలాగే ఉందని విమర్శించారు. శుక్రవారం గాంధీభవన్‌లో మీడియాతో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో ఫాం హౌస్ పాలన తప్పా.. ప్రజాపాలన ఎక్కడా చేయలేదని మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో కేబినెట్‌లో అన్ని నిర్ణయాలు జరుగుతాయని కేటీఆర్ గతంలో ఒప్పుకున్నారని గుర్తుచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబాన్ని విమర్శించడమే కేటీఆర్ పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. రేవంత్‌రెడ్డి కుటుంబంలో ఎంతమంది తమ ప్రభుత్వంలో ఉన్నారో కేటీఆర్ చెప్పాలని సవాల్ విసిరారు. కేటీఆర్ లాగా ఇంట్లో ఉన్నోళ్లందరికీ రాజకీయ పదవులను తమ ప్రభుత్వంలో ఇవ్వలేదని స్పష్టం చేశారు. కేటీఆర్ పదేళ్లు ఏం చేశారని, తెలంగాణకు తీసుకువచ్చిన పెట్టుబడులు ఏమయ్యాయని ప్రశ్నల వర్షం కురిపించారు. కేటీఆర్ అండ్ కో తెలంగాణకు మంచి చేయరని… తాము చేస్తుంటే అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. వ్యాపారవేత్తలను కేటీఆర్ బెదిరించారని ఆరోపించారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ని ఓడగొట్టినా కేటీఆర్‌కు బుద్ధి మారలేదని ఎద్దేవా చేశారు. చివరికి జూబ్లీహిల్స్‌లో ఓడగొట్టినా కేటీఆర్ మారడం లేదని విమర్శలు చేశారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.








