- పదవులు అడుక్కుంటే రావు..
- పోరాడి గుంజుకుంటేనే వస్తాయి
- హక్కుల సాధనకు పోరాటం తప్పదు
- మత్స్యకారులు రాబోయే కాలంలో ఐక్యంగా ఉండాలి
- ఎంపీ ఈటల రాజేందర్ హాట్ కామెంట్స్
నాగర్ కర్నూల్, మహా: తెలుగు జాతిలో సాహసం, ధైర్యం ఉన్నప్పటికీ, వెనుకబడ్డామనే ఆవేదన ఉందని ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిన ఉత్సవాలలో ఎంపీ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, హక్కుల సాధనకు త్యాగాలు, పోరాటాలు తప్పవని అన్నారు. మత్స్యకారుల ఐక్యత కోసం నీలం మధు చేస్తున్న ప్రయత్నం సఫలం కావాలని కోరుకున్నారు. తాను మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాక, తాండూరు ఎమ్మెల్యే నారాయణ రావు ముదిరాజ్ తో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కోరి, ముదిరాజ్‌లను బీసీ డి నుండి బీసీ ఏ లోకి మార్చాలని విజ్ఞప్తి చేశామని, జడ్చర్ల ఎన్నికల్లో ప్రకటించినా అది నెరవేరలేదని గుర్తుచేశారు. మంత్రిగా ఉన్నప్పుడు, సన్న బియ్యం సమస్య తర్వాత, మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రిని కోరానని తెలిపారు. పోచారం తో కలిసి అనేక రాష్ట్రాలు పర్యటించిన తర్వాత కేజీ కల్చర్, డీసీఎంల పంపిణీ వంటి పథకాలు వచ్చినా, అవి పూర్తిస్థాయిలో అమలు కాలేదన్నారు.
పదవులు అడుక్కుంటే రావు, గుంజుకుంటే వస్తాయి అని స్పష్టం చేస్తూ, మత్స్యకారులు రాబోయే కాలంలో ఐక్యంగా ఉండాలని, మనవాళ్ళు ఎవరో, ఇతరులు ఎవరో గుర్తించాలని పిలుపునిచ్చారు. మత్స్యకారుల గంగమ్మ, పెద్దమ్మ గుడులకు ప్రభుత్వ గ్రాంట్ పెట్టింది కూడా తానే అని తెలిపారు. మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోసం అనిమల్ హస్బెండరీ పార్లమెంటరీ కమిటీలో కూడా పోరాడుతున్నట్లు చెప్పారు. మనం కేవలం చేపలు పట్టే కూలీలుగా మిగిలిపోకుండా, మనమే పట్టాలి, అమ్మాలి, ఎగుమతి చేయాలి, వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ తయారు చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ జాతి అభివృద్ధికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకాటి శ్రీహరి, ఎంపీ డా. మల్లు రవి, నీలం మధు, సుధాకర్ రావు, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.








