సూర్యాపేట,మహా.
రాజకీయం అంటేనే రణక్షేత్రం. అక్కడ గెలవాలనే కసి, పదవిని దక్కించుకోవాలనే తపన కొన్నిసార్లు వ్యక్తిగత బాధలను సైతం పక్కనపెట్టేలా చేస్తాయి. సరిగ్గా ఇలాంటి సంఘటనే సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని మానాపురం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. ఓ వైపు ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన విషాదం.. మరోవైపు దశాబ్దాల రాజకీయ ఆకాంక్ష.. ఈ రెండింటి మధ్య సతమతమవుతూనే చివరికి రాజకీయానికే ఓ కుటుంబం మొగ్గుచూపింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. మానాపురం గ్రామానికి చెందిన బానోతు రాంకోటి కుటుంబానికి ఎప్పటి నుంచో సర్పంచ్ పీఠంపై ఆశ ఉంది. తన కుటుంబంలో ఒకరిని గ్రామ ప్రథమ పౌరుడిగా చూడాలన్నది రాంకోటి చిరకాల స్వప్నం. ఎన్నికలు వస్తున్నాయి, పోతున్నాయి తప్ప ఆయన కల మాత్రం నెరవేరడం లేదు. గతంలో పలుమార్లు పోటీకి సిద్ధపడినా, చివరి నిమిషంలో సన్నిహితుల ఒత్తిడి, గ్రామ పెద్దల అభ్యర్థనల మేరకు వెనక్కి తగ్గాల్సి వచ్చేది. కానీ ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని, కచ్చితంగా బరిలో నిలవాల్సిందేనని రాంకోటి గట్టిగా నిర్ణయించుకున్నారు.
అయితే విధి మరోలా తలచింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడానికి సరిగ్గా వారం రోజుల ముందే రాంకోటి తండ్రి, ఇంటి పెద్ద అయిన బానోతు బాల్య అనారోగ్యంతో మృతి చెందారు. తండ్రి మరణంతో ఆ ఇంట తీవ్ర విషాదం అలుముకుంది. కర్మకాండలు ముగిసి, ఆ కుటుంబం ఇంకా ఆ బాధ నుంచి పూర్తిగా కోలుకోనేలేదు. ఇంతలోనే ఎన్నికల నగారా మోగింది. మానాపురం సర్పంచ్ స్థానం రిజర్వేషన్లలో భాగంగా ఎస్టీ మహిళకు కేటాయించబడింది.
ఒకపక్క కన్నతండ్రిని కోల్పోయిన దుఃఖం గుండెల్లో ఉన్నప్పటికీ, ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రాజకీయ అవకాశం చేజారిపోకూడదనే ఉద్దేశంతో రాంకోటి కఠిన నిర్ణయం తీసుకున్నారు. శనివారం తన భార్య నాగమ్మతో కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేయించారు. పుట్టెడు దుఃఖంలోనూ సర్పంచ్ పదవి కోసం ఆ కుటుంబం వేసిన ముందడుగు ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. లక్ష్యం ముందు వ్యక్తిగత బాధలు అడ్డంకి కావని రాంకోటి రుజువు చేశారని కొందరు అంటుంటే, రాజకీయం అంటే ఇంతేనేమో అని మరికొందరు చర్చించుకుంటున్నారు.







