Mahaa Daily Exclusive

  తెలంగాణ ‘కిక్’కు కొత్త బాస్….

Share

తెలంగాణ ‘కిక్’కు కొత్త బాస్..
* రాష్ట్రవ్యాప్తంగా లిక్కర్ సిండికేట్ల నయా ట్రెండ్!
* 2620 షాపుల చుట్టూ తిరుగుతున్న వేల కోట్ల చక్రం!
* తెలంగాణ అంతటా మారనున్న మద్యం దుకాణాల ముఖచిత్రం!
* రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచే వైన్ షాపుల అసలైన పండుగ!

హైద్రాబాద్, మహా.

తెలంగాణ రాష్ట్రంలో మద్యం అంటే కేవలం ఒక పానీయం కాదు, అది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నడిపించే ఒక ప్రధాన ఇంధనం. గత కొన్ని వారాలుగా రాష్ట్రవ్యాప్తంగా సాగిన మద్యం టెండర్ల ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చింది. దరఖాస్తుల రూపంలోనే ప్రభుత్వానికి కనీవినీ ఎరుగని ఆదాయాన్ని తెచ్చిపెట్టిన ఈ ప్రక్రియ, ఇప్పుడు అసలైన అంకానికి చేరుకుంది. నేటి నుంచి రాష్ట్రంలోని వేలాది మద్యం దుకాణాలు కొత్త యజమానుల చేతుల్లోకి వెళ్లనున్నాయి. ఈసారి గౌడ కులస్తులకు, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు చేయడంతో సామాజిక సమీకరణాలు కూడా మారాయి.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మద్యం ప్రియులు, వ్యాపారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి నూతన మద్యం పాలసీకి సంబంధించిన షాపుల నిర్వహణ కొత్త లైసెన్స్ దారుల చేతికి వెళ్లనుంది. రాష్ట్రంలోని 33 జిల్లాల పరిధిలో మొత్తం 2,620 మద్యం దుకాణాలకు గాను ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేయగా, దీనికి రికార్డు స్థాయిలో స్పందన వచ్చింది. లక్షకు పైగా దరఖాస్తులు వెల్లువెత్తడంతో, కేవలం నాన్-రీఫండబుల్ అప్లికేషన్ ఫీజు రూపంలోనే ప్రభుత్వ ఖజానాకు దాదాపు రెండున్నర వేల కోట్లకు పైగా ఆదాయం సమకూరడం విశేషం. ఇది రాష్ట్ర చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డుగా నిలిచింది. నేటి నుంచి దుకాణాలు తెరుచుకోనుండటంతో, ఈ ఆదాయం పన్నుల రూపంలో మరింతగా పెరిగి ప్రభుత్వాదాయంలో సింహభాగం ఆక్రమించనుంది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,620 వైన్ షాపుల్లో, సామాజిక న్యాయం పాటించేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈసారి స్పష్టంగా కనిపిస్తోంది. ఇందులో గౌడ సామాజిక వర్గానికి 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం చొప్పున దుకాణాలను కేటాయించారు. అంటే దాదాపు 786 షాపులు రిజర్వేషన్ల కింద ఆయా వర్గాలకు దక్కాయి. మిగిలిన షాపులకు ఓపెన్ కేటగిరీలో తీవ్రమైన పోటీ నెలకొంది. ఒక్కో షాపుకు వందల సంఖ్యలో దరఖాస్తులు రావడంతో, లక్కీ డ్రాలో గెలిచిన వారు తమను తాము అదృష్టవంతులుగా భావిస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ వంటి అర్బన్ జిల్లాల్లో మద్యం అమ్మకాలు విపరీతంగా ఉండటంతో ఇక్కడ పోటీ తారాస్థాయికి చేరింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా సిండికేట్ల బెడద ఉన్నప్పటికీ, కొత్త నిబంధనల వల్ల కొంత పారదర్శకత వచ్చిందనేది విశ్లేషకుల మాట.
ఆదాయం విషయానికి వస్తే, తెలంగాణ ప్రభుత్వం మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంపై భారీ ఆశలే పెట్టుకుంది. గత ఏడాది గణాంకాలను పరిశీలిస్తే, రాష్ట్రంలో దాదాపు 30 వేల కోట్ల రూపాయలకు పైగా మద్యం అమ్మకాలు జరిగాయి. ఈసారి లైసెన్స్ ఫీజులు, పెరిగిన జనాభా, వినియోగం దృష్ట్యా ఈ ఆదాయం 40 వేల కోట్ల మార్కును దాటిన ఆశ్చర్యం లేదని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒక్కో షాపు లైసెన్స్ ఫీజు ప్రాంతాన్ని బట్టి సంవత్సరానికి 50 లక్షల నుంచి 1 కోటి 10 లక్షల వరకు ఉంది. దీనికి తోడు స్పెషల్ షాపులు, బార్లు, క్లబ్బుల ఆదాయం అదనం. ఇలా అన్ని రకాలుగా చూస్తే, ప్రభుత్వానికి రోజువారీ నిర్వహణకు అవసరమైన నిధుల్లో మద్యం ద్వారా వచ్చే వాటానే కీలకం కానుంది.
నేటి నుంచి కొత్త యజమానులు బాధ్యతలు స్వీకరిస్తుండటంతో, వినియోగదారులు మాత్రం కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో మాదిరిగా ఎం.ఆర్.పి రేట్ల కంటే ఎక్కువ వసూలు చేస్తారా లేదా బెల్టు షాపుల ద్వారా విచ్చలవిడిగా అమ్మకాలు సాగిస్తారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. లైసెన్స్ దక్కించుకోవడానికి పెట్టిన కోట్లాది రూపాయల పెట్టుబడిని వెనక్కి రాబట్టుకునేందుకు వ్యాపారులు నిబంధనలను తుంగలో తొక్కితే సామాన్యుడి జేబుకు చిల్లు పడటం ఖాయం. అయితే ఎక్సైజ్ శాఖ మాత్రం అక్రమాలకు తావులేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది. ఏది ఏమైనా, నేటి ఉదయం వైన్ షాపు షట్టర్ తెరుచుకోవడంతో తెలంగాణ అంతటా కాసుల గలగల, సీసాల కలకల మొదలై, వచ్చే రెండేళ్ల పాటు ఈ కొత్త యజమానుల హవానే సాగనుంది.

Latest