Mahaa Daily Exclusive

  జీహెచ్ఎంసీ ఇక జీహెచ్ఏ…..

Share

  • జీహెచ్ఎంసీ ఇక జీహెచ్ఏ
  • ప్రస్తుతం ఉన్న డివిజన్లకు రెట్టింపు డివిజన్లు
  • కొత్త మునిసిపాలిటీలు, పురపాలికల విలీనంతో మారనున్న రూపు రేఖలు

హైదరాబాద్, మహా : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (హెచ్ఎంసీ) ఇక నుంచి గ్రేటర్ హైదరాబాద్ అథారిటీ(జీహెచ్ఏ)గా రూపాంతరం చెందనుంది. ప్రస్తుతం ఉన్న జీహెచ్ఎంసీ పరిధిని విస్తరించి శివారు 27 పట్టణ స్థానిక సంస్థలను విలీనం చేయడం ద్వారా బృహత్‌ హైదరాబాద్‌ నగరాన్ని ఏర్పాటు చేసే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ విలీన ప్రక్రియ తర్వాత జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రస్తుతం ఉన్న 150 డివిజన్లు సుమారు 300 డివిజన్లకు పెరిగే అవకాశం ఉంది. శివారు ప్రాంతాల నుంచి విలీనం కానున్న పట్టణ స్థానిక సంస్థల పరిధిలో మరో సుమారు వంద డివిజన్లు ఉన్నాయి. ఈ భారీ మార్పుకు సంబంధించిన పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలను అధికారులు శఱవేగంగా సిద్దం చేస్తున్నారు.

విలీన ప్రక్రియ పూర్తయ్యాక ప్రస్తుతం ఉన్న డివిజన్లన్నింటినీ పునర్‌ వ్యవస్థీకరించనున్నారు. ఈ సందర్భంగా పరిపాలనాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జోనల్ కమిషనర్లు, ఉన్నతాధికారులు శనివారం ప్రభుత్వానికి తమ అభిప్రాయాలను సమర్పించారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24 అసెంబ్లీ స్థానాలు, 6 జోన్లు, 30 సర్కిళ్లు, 150 డివిజన్లు ఉన్నాయి. వీటిలో కొన్ని డివిజన్లు రెండు లేదా మూడు అసెంబ్లీ స్థానాల్లో విస్తరించి ఉండటం వలన పరిపాలన సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి, డివిజన్ల హద్దులు తప్పనిసరిగా ఒకే అసెంబ్లీ స్థానం పరిధిలో ఉండేట్టుగా పునర్విభజన ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు తుది నిర్ణయం తీసుకున్నారు. ఈ డివిజన్ల పునర్విభజన అనంతరం, పరిపాలనా సౌలభ్యం కోసం సర్కిళ్లు, జోన్లను కొత్తగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

బృహత్‌ నగర ముఖచిత్రాన్ని రూపొందించే పనిలో జీహెచ్‌ఎంసీ యంత్రాంగం నిమగ్నమైంది. ఎంసీఆర్ హెచ్ఆర్ డీలోని సీజీజీ (సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌)లో జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన నివేదికలు, ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు స్వయంగా శనివారం రెండు సార్లు సీజీజీని సందర్శించి, అధికారులు రూపొందించిన ప్రతిపాదనలు, ఇతర పత్రాలను పరిశీలించారు. శివారు పురపాలికలు, నగరపాలిక కమిషనర్లు కూడా తమ స్థానిక సంస్థల పూర్తి సమాచారాన్ని ప్రభుత్వానికి నివేదించారు. విలీన ప్రక్రియకు సంబంధించిన ఆర్డినెన్స్ పత్రాలు ఇప్పటికే రాజ్‌భవన్‌కు చేరినట్లు సమాచారం, గవర్నర్‌ సంతకం చేయడమే తరువాయిగా ఉంది. నగర శివార్లలోని 20 పురపాలికలు, ఏడు నగరపాలక సంస్థలు జీహెచ్‌ఎంసీలో విలీనమవుతుండటంతో సదరు మున్సిపల్‌ కార్యాలయాలన్నీ ఇక నుంచి జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ కార్యాలయాలుగా రూపాంతరం చెందనున్నాయి. అక్కడి పురపాలక కమిషనర్లు.. జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్లుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

ఎల్‌బీనగర్‌ జోన్‌ లో ప్రస్తుతమున్న సర్కిళ్లు కాప్రా, ఉప్పల్, హయత్‌నగర్, ఎల్‌బీనగర్, సరూర్‌నగర్‌లు ఉన్నాయి. కొత్తగా ఆదిబట్ల, మీర్‌పేట్, బడంగ్‌పేట, తుర్కయాంజాల్, పెద్దఅంబర్‌పేట్, పీర్జాదిగూడ, పోచారం, ఘట్‌కేసర్, బోడుప్పల్‌లు చేరనున్నాయి. సికింద్రాబాద్‌ జోన్‌లో ప్రస్తుతం ముషీరాబాద్, అంబర్‌పేట్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, బేగంపేట సర్కిళ్ళు ఉండగా, కొత్తగా తూంకుంట, నాగారం, దమ్మాయిగూడ, జవహర్‌నగర్‌లో తోడవనున్నాయి. కూకట్‌పల్లి జోన్‌లో ప్రస్తుతం మూసాపేట, కూకట్ పల్లి, కుత్భుల్లాపూర్, గాజుల రామారం, ఆల్వాల్ సర్కిళ్ళు ఉండగా, కొత్తగా కొంపల్లి, గుండ్ల పోచంపల్లి, మేడ్చల్, దుండిగల్, నిజాంపేట్, బొల్లారంలు చేరనున్నాయి. చార్మినార్‌ జోన్‌లో మలక్ పేట, సంతోష్ నగర్, చాంద్రాయణగుట్ట, చార్మినార్, ఫలక్ నుమా, రాజేంద్రనగర్ సర్కిళ్ళు ఉండగా కొత్తగా బండ్లగూడ జాగీర్, శంషాబాద్, జల్‌పల్లి, తుక్కుగూడ సర్కిళ్ళు రానున్నాయి. శేరిలింగంపల్లి జోన్‌ లో యూసుఫ్ గూడ, శేరిలింగపల్లి, చందానగర్, పటాన్ చెరువు సర్కిళ్ళు ఉండగా, కొత్తగా అమీన్‌పూర్, తెల్లాపూర్,మణికొండ, నార్సింగి సర్కిళ్ళు రానున్నాయి. ఖైరతాబాద్ జోన్ పరిధిలో మెహిదీపట్నం,కార్వాన్, గోషామహల్ ఖరతాబాద్, జూబ్లిహిల్స్ సర్కిళ్ళు ఉండగా కొత్తగా మణికొండ సర్కిల్ ను ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. అయితే ఇప్పటికే ఖైరతాబాద్ సర్కిల్ లో వీవీఐపీలు ఎక్కువ ఉన్న ప్రాంతంతో పాటు పరిధి కూడా అధికంగా ఉండటంతో మణికొండ సర్కిల్ ను శేరిలింగంపల్లిలో చేరిస్తే ఎలా ఉంటుందన్న అంశంపై అధికారులు చర్చిస్తున్నారు.

జోన్ లు, సర్కిళ్ళ వారిగా ప్రాంతాలు, మ్యాప్ లను రూపొందిస్తున్న అధికారులు రెండు మూడు రోజులలో తుది రూపం ఇచ్చి పూర్తి స్థాయిలో గ్రేటర్ హైదరాబాద్ అథారిటీ (జీహెచ్ఏ) ను తీర్చిదిద్దనున్నారు. మ్యాప్ కు తుది రూపం ఇచ్చిన అనంతరం ఉన్నత స్థాయిలో సమీక్షించి మార్పులు, చేర్పుల అంశాలను పరిశీలించిన అనంతరం ప్రభుత్వ ఆమోదానికి పంపించాలని నిర్ణయించారు.

బడ్జెట్ రూపకల్పనలోనూ బిజీ బిజీ

విలీన మునిసిపాలిటీల తర్వాత నగర రూపు రేఖలు మార్పును సిద్దం చేస్తూనే అధికారులు మరో వైపు ప్రస్తుతం ఉన్న జీహెచ్‌ఎంసీ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలను రూపొందిస్తోంది. ఈ బడ్జెట్‌లో ఆస్తిపన్ను ఆదాయంపైనే ప్రధానంగా దృష్టి సారించారు. రెవెన్యూ విభాగం కొత్త ఆర్థిక సంవత్సరంలో ఆస్తిపన్ను ద్వారా రూ. 2,200 కోట్లు, ట్రేడ్ లైసెన్స్ రుసుము ద్వారా రూ. 115 కోట్లు, ప్రకటనల రుసుము ద్వారా రూ. 50 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే, నగర ప్రణాళిక విభాగం నిర్మాణ అనుమతుల రుసుము ద్వారా రూ. 1,200 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పద్దు రూ. 8,440 కోట్లు ఉండగా.. రాబోయే ఆర్థిక సంవత్సరం పద్దు సుమారు రూ. 8,600 కోట్లు వరకు ఉంటుందని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు.

Latest