Mahaa Daily Exclusive

  మావోయిస్టు అగ్రనేత తిప్పిరి తిరుపతి కోసం 40 ఏళ్ల నిరీక్షణ, బంధువుల హృదయ విదారక విజ్ఞప్తి

Share

అజ్ఞాతంలో దశాబ్దాలు.
• తిప్పిరి తిరుపతి క్షేమం కోసం నిరీక్షణ.
* ఆచూకీ తెలియని అగ్రనేత కోసం ఆక్రందన..!
* 40 ఏళ్ల నిరీక్షణ, ఎన్‌కౌంటర్ భయం .
* రేవంత్‌, పవన్‌కల్యాణ్‌కు హృదయ విదారక విజ్ఞప్తి.
* మానవత్వం చూపాలంటూ మావోయిస్టు అగ్రనేత బంధువు సుమ ఆక్రందన.

హైద్రాబాద్, మహా.

రాజకీయంగా, భద్రతా పరంగా అత్యంత కీలకమైన అంశం… మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ ఆచూకీ. అయితే, ఈ భద్రతా వ్యవహారం వెనుక దశాబ్దాలుగా నిరీక్షిస్తున్న ఒక కుటుంబం యొక్క హృదయ విదారక గాథ దాగి ఉంది. దేవ్‌జీ పోలీసుల అదుపులో ఉన్నారనే ఊహాగానాలు, పౌర హక్కుల సంఘాల ఎన్‌కౌంటర్ ఆరోపణలు ఒక కుటుంబాన్ని తీవ్ర అభద్రతాభావంలోకి నెట్టాయి. ఈ సంక్షోభ సమయంలో, దేవ్‌జీ తమ్ముడి కూతురు సుమ… తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు రాసిన లేఖ ఇప్పుడు దేశవ్యాప్తంగా మానవత్వపు కోణాన్ని చర్చకు తెచ్చింది. నాలుగు దశాబ్దాల నిరీక్షణ, నిత్యం వెంటాడే భయం నుంచి తమకు విముక్తి కల్పించాలని, న్యాయం అందించాలని ఆమె చేసిన ఈ విజ్ఞప్తి సామాజిక మాధ్యమాల్లో పెను సంచలనంగా మారింది.

*అడవిలో పెదనాన్న కోసం ఆగిన జీవితాలు* ‘మానవీయ స్పందన’ కోరుతూ సీఎంలకు సుమ లేఖ

మావోయిస్టు అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ ఆచూకీపై నెలకొన్న సందిగ్ధత ఆయన కుటుంబాన్ని కన్నీటి పర్యంతం చేస్తోంది. తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా, కోరుట్ల పట్టణానికి చెందిన సుమ అనే యువతి… గత కొద్ది రోజులుగా వైరల్ అవుతున్న వార్తలపై స్పందించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు ఒక బహిరంగ లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.
“నా పెదనాన్న తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, మావోయిస్టు పార్టీ చీఫ్‌గా ఉన్నారు. ఇటీవల ఆయన పోలీసుల కస్టడీలో ఉన్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలు నిజమా? కాదా? అనేది మా కుటుంబానికి స్పష్టంగా తెలియకపోయినా, ప్రతిరోజూ వినిపించే ఈ సమాచారం మా కుటుంబాన్ని తీవ్ర కలిచివేతకు గురిచేస్తోంది,” అంటూ ఆమె తమ ఆందోళనను వ్యక్తపరిచారు. నిత్యం భయం, ఆశ మధ్య జీవించడం ఎంత కష్టమో ఆమె మాటలు తెలియజేస్తున్నాయి. తమ ప్రియతమ వ్యక్తి గురించి వస్తున్న ప్రతి వార్త ఒక కుటుంబాన్ని తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేస్తోందని సుమ పేర్కొన్నారు.
ఈ వార్తల్లో నిజముంటే, దయచేసి ఆయనను కోర్టులో హాజరుపరచాలని, తద్వారా న్యాయపరమైన మార్గంలో ప్రక్రియ కొనసాగేలా చూడాలని లేదా ఆయనకు లొంగిపోవడానికి అవకాశం ఇవ్వాలని సుమ కన్నీటితో వేడుకున్నారు. “గత 40 ఏళ్లుగా మా కుటుంబం ఆయన కోసం ఎదురు చూడని రోజు లేదండి.. ఆయన కోసం వేచిచూస్తున్న సమయాన్ని మాటల్లో చెప్పలేం,” అంటూ దశాబ్దాల తరబడి తమ జీవితాలు ఆయన రాక కోసం ఆగిపోయిన తీరును సుమ గుర్తు చేసుకున్నారు. అజ్ఞాతంలో ఉన్న తమ పెదనాన్న క్షేమం గురించి నిత్యం భయపడుతూ బతుకుతున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
“న్యాయం కోసం నిజమైన నాయకులు ముందుండే వారు మీరు అని నమ్మే ఒక పౌరురాలిగా, మీ స్పందన కోసం ఎదురు చూస్తున్నాను సార్. మా కుటుంబానికి మీరు తప్పకుండా న్యాయం చేస్తారని మనస్పూర్తిగా విశ్వసిస్తున్నాం,” అని సుమ లేఖలో పేర్కొన్నారు. ఈ అంశంపై ముఖ్యమంత్రులు మానవీయ కోణంలో స్పందించి, కోరుట్ల బిడ్డ క్షేమానికి సహకరిస్తారనే ఆశతో ఎదురు చూస్తున్నామని ఆమె విన్నవించుకున్నారు. ఈ లేఖ కేవలం ఒక రాజకీయ నాయకుడి ఆచూకీకి సంబంధించినది కాదు, నాలుగు దశాబ్దాలుగా ఆగిపోయిన ఒక కుటుంబ జీవితానికి సంబంధించినదనే మానవీయ దృష్టికోణం ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది.