Mahaa Daily Exclusive

  ప్రభుత్వ భూమిని కబ్జా చేయడం ట్యూమర్ తో సమానం

Share

  • ప్రభుత్వ భూమిని కబ్జా చేయడం ట్యూమర్ తో సమానం
  • ట్యూమర్లకు ఆపరేషన్లు చేస్తున్నానన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
  • 2026 లో లక్ష కోట్ల ప్రభుత్వ భూముల కబ్జాల నుంచి కాపాడటమే లక్ష్యమని వెల్లడి

హైదరాబాద్, మహా : ప్రభుత్వ భూములను కబ్జా చేయటం ట్యూమర్ వ్యాధి సోకినదాంతో సమానమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. శస్త్రచికిత్సలు చేసే వైద్యులకంటే తాము ఏ మాత్రం తక్కువకాదని, వ్యాధులకు డాక్టర్లు చికిత్సలు చేస్తుంటే సమాజంలో పెరిగిపోతున్న కబ్జాలనే ట్యూమర్లకు తాను చికిత్సలు చేసి తొలగిస్తున్నట్లు చెప్పారు. మంచి ఆరోగ్యానికి చికిత్సచేసి ట్యూమర్లను తొలగించటం ఒకటే ఉత్తమమైన మార్గమన్నారు. ఆక్రమణదారుల నుండి ప్రభుత్వ ఆస్తులు, భూములను రక్షిస్తున్నట్లు చెప్పారు. 2026 సంవత్సరంలో లక్ష కోట్లరూపాయల విలువైన ప్రభుత్వ భూముల కబ్జాలను తొలగించటమే టార్గెట్ గా పెట్టుకున్నట్లు చెప్పారు.

ఒక కార్యక్రమంలో రంగనాథ్ మాట్లాడుతు గడచిన 15 నెలల్లో రూ. 60 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను హైడ్రా రక్షించిందన్నారు. కబ్జాదారుల నుండి ప్రభుత్వ భూములను విడిపించి తిరిగి ప్రభుత్వానికి స్వాధీనం చేయటం ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అని వివరించారు. కబ్జాల్లో ఉన్న ఎన్నో చెరువులను విడిపించి వాటిని ప్రభుత్వపరం చేసిన విషయాన్ని రంగనాథ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కబ్జాలనుండి విడిపించిన చెరువుల్లో కొన్నింటిని అత్యంత సుందరంగా తీర్చిదిద్దామన్నారు. సున్నం చెరువు లాంటి మరికొన్ని చెరువులను తిరిగి ఉపయోగంలోకి తెచ్చినట్లు కూడా చెప్పారు. కబ్జా చెర నుండి విడిపించి, సుందరంగా తీర్చిదిద్దిన చెరువల చుట్టుపక్కల జనాలంతా ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారన్నారు. కాల్వలను కబ్జాలు చేసి డ్రైన్ వాటర్ సక్రమంగా వెళ్ళకుండా చేసిన నిర్మాణాలను కూడా గుర్తించామని, ఇలాంటి నాలాలపైన నిర్మించిన నిర్మాణాల్లో కొన్నింటిని ఇప్పటికే కూల్చేసి నాలాల ద్వారా డ్రైనేజి నీరు, వరదనీరు వెళ్ళేందుకు మార్గాన్ని ఏర్పాటు చేశామన్నారు.