- దేవ్ జీ, రాజిరెడ్డి మాతోనే ఉన్నారు
- మావోయిస్టు అగ్రనేత వికల్ప్ పేరుతో లేఖ విడుదల
- లొంగిపోయేందుకు పోలీసులకు ఎలాంటి ఒప్పందం కుదరలేదని స్పష్టత
విజయవాడ, మహా : మావోయిస్టు కీలక నేతలు దేవ్జీ, మల్లా రాజిరెడ్డి తమతోనే ఉన్నారని మావోయిస్టులు స్పష్టం చేశారు. ఈ మేరకు మావోయిస్టు అగ్రనేత వికల్ప్ పేరుతో ఓ లేఖ శుక్రవారం విడుదల అయింది. ఈ లేఖలో పలు కీలక అంశాలను కూడా ప్రస్తావించారు. తాము పోలీసులకు లొంగిపోవడానికి ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని స్పష్టత ఇచ్చారు. ఏపీలో జరిగిన ఎన్ కౌంటర్ లో హతమైన మావోయిస్టు అగ్రనేత హిడ్మా సమాచారాన్ని దేవ్జీ చెప్పారనేది అవాస్తవమని లేఖలో తెలిపారు. హిడ్మా హత్యకు నలుగురు వ్యక్తులే కారణమని లేఖలో పేర్కొన్నారు. కోసాల్ అనే వ్యక్తి హిడ్మా హత్యకు ప్రధాన కారణమని పేర్కొన్నారు. విజయవాడకు చెందిన కలప వ్యాపారి, ఫర్నిచర్ వ్యాపారి, మరో కాంట్రాక్టర్ హిడ్మా హత్యకు కారకులని తెలిపారు. అక్టోబరు 27వ తేదీన చికిత్స కోసం కలప వ్యాపారి ద్వారా హిడ్మా విజయవాడకు వెళ్లారని, అనంతరం హిడ్మాను పోలీసులు పట్టుకుని ఎన్కౌంటర్ చేశారని ఆరోపించారు. ఆ సమాచారాన్ని పోలీసులకు చేరవేయడంతోనే 13 మందిని పట్టుకొని హత్య చేశారని విమర్శించారు. హత్యను కప్పిపుచ్చేందుకు మారేడుమల్లి రంపచోడవరం ఎన్కౌంటర్ల కట్టుకథ అల్లారని ధ్వజమెత్తారు. హిడ్మా హత్య ఏపీ పోలీసులు చేసిన ఆపరేషన్ కాదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్ అని ఆరోపించారు. హిడ్మా ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు.






