- చంద్రబాబుతో కోమటిరెడ్డి భేటీ
- గ్లోబల్ సమ్మిట్ కు రావాలని ఆహ్వానం
- పవన్ పై పరిస్థితులను బట్టి మాట్లాడా
- జగన్ అసెంబ్లీకి రావాలి.. హోదా ఉంటేనే అనడం సరికాదు
అమరావతి, మహా
తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం త్వరలో నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’కు రావాలని చంద్రబాబును ఆయన ఆహ్వానించారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ లో నిర్వహిస్తున్న తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సదస్సుకు రావాలని సీఎం చంద్రబాబును రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోమటిరెడ్డి కోరారు. ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి .. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’ను దావోస్ సమ్మిట్ తరహాలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సంస్థల ప్రతినిధులు, వ్యాపారవేత్తలు, వివిధ రంగాల నిపుణులు సదస్సుకు హాజరవుతున్నారని ఆయన చంద్రబాబుకు వివరించారు. దీనిపై చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. మరోవైపు చంద్రబాబుతో భేటీ తర్వాత బయటికి వచ్చిన కోమటిరెడ్డి జగన్ అసెంబ్లీకి వెళ్లకపోవడంపై స్పందించారు. జగన్ కి ప్రతిపక్ష హోదా ముఖ్యo కాదని ఆయన తేల్చేసారు. జగన్ అది వదిలి అసెంబ్లీకి వచ్చి కూర్చోవాలని సూచించారు. ప్రజా సమస్యలపై వచ్చి పోరాడాలన్నారు.హోదా ఉంటేనే అసెంబ్లీకి వెళ్తాము అని జగన్ అనడం కరెక్ట్ కాదన్నారు. తెలంగాణ లాగా ఏపీ అభివృద్ధి చెందాలి అని కోరుకుంటున్నట్లు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. పవన్ కల్యాణ్ పై అప్పటి పరిస్థితులను బట్టి మాట్లాడానన్నారు. తెలంగాణలో కోకాపేట ఏరియాలో భూముల విలువ రూ.100 కోట్లు పలుకుతున్నాయని వివరించారు. అందుకే ఆదిభట్ల వద్ద ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి తమ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తోందని తెలిపారు. ఇప్పుడు ఇంజనీరింగ్ పూర్తయిన విద్యార్థుల్లో స్కిల్స్ ఉండటం లేదని… వారికి పలు అంశాలపై అవగాహన కల్పించేలా తమ ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.






