* సింహాద్రిలో ‘కింగ్’ కోహ్లీ సందడి..
* అప్పన్న సేవలో టీమిండియా స్టార్స్!
* విశాఖ విజయం తర్వాత దైవ సన్నిధిలో..
* కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్న విరాట్!
* భక్త పారవశ్యంలో కోహ్లీ, సుందర్.. సింహాచలంలో పోటెత్తిన అభిమానులు!
* ఆలయంలో కోహ్లీని చూసి ఎగిరి గంతేసిన ఫ్యాన్స్..
* వైరల్ అవుతున్న సింహాచలం విజువల్స్!
విశాఖపట్నం, మహా.
విశాఖపట్నం వేదికగా జరిగిన వన్డే సిరీస్‌లో భారత జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. మైదానంలో పరుగుల వరద పారించిన టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, సిరీస్ విజయం తర్వాత ఆధ్యాత్మిక బాట పట్టారు. ఆదివారం ఉదయం టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ, యువ ఆటగాడు వాషింగ్టన్ సుందర్‌తో కలిసి ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాద్రి శ్రీవరాహ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న క్రికెటర్లకు దేవస్థాన అధికారులు, అర్చకులు సాదర స్వాగతం పలికారు.
సాంప్రదాయ వస్త్రధారణలో ఆలయంలోకి ప్రవేశించిన విరాట్ కోహ్లీ, భక్తిశ్రద్ధలతో విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ఆచారాల ప్రకారం కోహ్లీ అక్కడి మహిమాన్వితమైన కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అనంతరం బేడా మండపం చుట్టూ ప్రదక్షిణలు చేసి, గర్భగుడిలోని సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. స్వామివారి సేవలో తన్మయత్వంతో పాల్గొన్న కోహ్లీకి, దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం మరియు అప్పన్న స్వామి చిత్రపటాన్ని విరాట్, సుందర్‌లకు అందజేశారు.
ఇక తమ అభిమాన క్రికెటర్లు ఆలయానికి వచ్చారని తెలుసుకున్న భక్తులు, స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. క్యూలైన్లలో ఉన్న భక్తులు కోహ్లీని చూడగానే ఆనందంతో కేరింతలు కొట్టారు. చాలామంది తమ మొబైల్ ఫోన్లలో కోహ్లీని బంధించేందుకు పోటీపడగా, మరికొందరు దూరం నుంచే సెల్ఫీలు తీసుకుంటూ మురిసిపోయారు. కోహ్లీ రాకతో సింహాచల ఆలయ ప్రాంగణంలో కాసేపు పండుగ వాతావరణం నెలకొంది. ఇటీవలే ముగిసిన వన్డే సిరీస్‌లో టీమిండియా 2-1 తేడాతో ఘన విజయం సాధించిన విషయం విదితమే. ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. రెండు అద్భుతమైన సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో కలిపి మొత్తం 302 పరుగులు సాధించి, ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును సొంతం చేసుకున్నాడు. విశాఖలో కోహ్లీకి అత్యంత ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ఈ క్రమంలోనే అప్పన్న స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ కోహ్లీకి ఉండాలని, భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.







