Mahaa Daily Exclusive

  ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు.. కొనసాగుతూనే ఉంటుంది: 

Share

  • ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు.. కొనసాగుతూనే ఉంటుంది:
  •  యుద్ధ తంత్రంలో ‘ఏఐ’దే కీలక పాత్ర.. సైన్యం అప్రమత్తంగా ఉండాలి.
  •  త్రివిధ దళాధిపతి (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహన్.

ఢిల్లీ,మహా.

భారత రక్షణ వ్యవస్థను పటిష్టం చేయడం, సరిహద్దుల్లో సవాళ్లను ఎదుర్కోవడంపై త్రివిధ దళాధిపతి (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఢిల్లీ వేదికగా మీడియాతో మాట్లాడిన ఆయన, ‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా ముగియలేదని, అది నిరంతర ప్రక్రియగా కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా యుద్ధ తంత్రాలు మారుతున్నాయని, సైన్యం సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ‘ఆపరేషన్ సిందూర్’పై స్పందిస్తూ, ఈ ఆపరేషన్ ఇంకా పూర్తి కాలేదని, దేశ భద్రత దృష్ట్యా ఇది కొనసాగుతూనే ఉంటుందని తేల్చిచెప్పారు. సైన్యం తమ విధుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించకూడదని, అలసత్వం అనేది అసలు పనికిరాదని ఆయన సైనికాధికారులను, జవాన్లను హెచ్చరించారు.

 

ఒకప్పుడు యుద్ధాలంటే కేవలం మైదానంలోనే (ఫీల్డ్) జరిగేవని, కానీ నేటి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని అనిల్ చౌహన్ విశ్లేషించారు. ప్రస్తుతం యుద్ధ తంత్రంలో సాంకేతికతదే పైచేయి అని పేర్కొన్నారు. సమాజంలో కృత్రిమ మేధ ఇప్పుడు అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని, సైన్యం కూడా ఈ కొత్త సాంకేతికతను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలని సూచించారు. ఆధునిక సవాళ్లను ఎదుర్కోవడానికి టెక్నాలజీపై పట్టు సాధించడం అనివార్యమని ఆయన అభిప్రాయపడ్డారు.

 

అకాడమీలో క్యాడెట్లకు అత్యుత్తమ శిక్షణ అందిందని ప్రశంసించిన సీడీఎస్, దేశ సేవ కోసం తమ పిల్లలను సైన్యానికి అప్పగించిన తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్లు భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. విధుల్లో ఎవరైనా తప్పులు చేస్తే, దానికి వారే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దేశ సేవలో చివరి శ్వాస వరకు పోరాడేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. సైనిక విలువలను కాపాడుతూ, క్రమశిక్షణతో మెలుగుతూ దేశ రక్షణలో భాగస్వాములు కావాలని అనిల్ చౌహన్ ఉద్ఘాటించారు.