Mahaa Daily Exclusive

  * నాపై కుట్రలు చేస్తున్నారు.. సమయమే సమాధానం చెబుతుంది… బండి పీఆర్వో పోస్టుపై ఈటల ఫైర్.

Share

* నాపై కుట్రలు చేస్తున్నారు.. సమయమే సమాధానం చెబుతుంది.
* బండి పీఆర్వో పోస్టుపై ఈటల ఫైర్.
* సొంత ఊర్లో నన్ను తొక్కేయాలని చూశారు..
* పంచాయతీ ఎన్నికల తర్వాత అన్నీ బయటపెడతా.
* బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ .

హైదరాబాద్ , మహా.

కేంద్రమంత్రి బండి సంజయ్ పీఆర్వో సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టుపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రంగా స్పందించారు. శనివారం కమలాపూర్‌లో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, తనపై కొంతమంది కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తాను బీజేపీ ఎంపీనని గుర్తుచేస్తూ, సోషల్ మీడియాలో తన గురించి పెడుతున్న పోస్టులను తాను కూడా గమనించానని అన్నారు. అవగాహన ఉన్నవారు ఎవరైనా ఇలాంటి పోస్టులు పెడతారా అని ఆయన ప్రశ్నించారు. అయితే ఇలాంటి చిల్లర పోస్టులను తాను పెద్దగా పట్టించుకోనని, తాను ఏ పార్టీలో ఉండాలనేది ప్రజలే నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. ఈ అంశాలను బీజేపీ అధిష్టానం పరిశీలిస్తుందని, సమయమే అన్నింటికీ సమాధానం చెబుతుందని వ్యాఖ్యానించారు. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ రెండు, మూడు విడతలు పూర్తయిన తర్వాత ఇటీవల జరిగిన అన్ని పరిణామాలపై పూర్తిస్థాయిలో మాట్లాడతానని ఈటల వెల్లడించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపైనా ఈటల రాజేందర్ నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిలా కాకుండా ఒక ఈవెంట్ మేనేజర్‌లా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఖజానాలో నిధులు లేకపోయినా, ఈవెంట్ మేనేజ్‌మెంట్ కోసం మాత్రం సీఎం వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. సింగరేణిలో కార్మికుల క్వార్టర్లు బాగు చేయడానికి డబ్బులు లేవు కానీ, సీఎం తన ఫుట్‌బాల్ ట్రైనింగ్ కోసం సింగరేణి నిధులను మళ్లిస్తున్నారని ఆరోపించారు. ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటూ పేదల ఇళ్లను కూలుస్తారా? లేక పెద్దల ఆస్తులను కాపాడుతారా? అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఉందని, తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం వల్లకాడులా మారుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం మీడియాను మేనేజ్ చేయడం తప్ప క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని దుయ్యబట్టారు.
మరోవైపు బీఆర్ఎస్ పార్టీపైన, పంచాయతీ ఎన్నికల ఫలితాలపైన కూడా ఈటల స్పందించారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతలు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ప్రజలు బీజేపీ అభ్యర్థులను ఆదరించారని తెలిపారు. గెలిచిన సర్పంచ్‌లకు రూ. 5 నుంచి రూ. 10 లక్షల వరకు ఎర చూపి బీఆర్ఎస్‌లో చేర్చుకోవడానికి చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. తన సొంత గ్రామమైన కమలాపూర్‌లో కూడా తనను రాజకీయంగా తొక్కేయాలని కొంతమంది చూశారని, కానీ ప్రజలు వారి కుట్రలను తిప్పికొట్టారని అన్నారు. నిస్వార్థంగా పనిచేసే తమ కార్యకర్తలను, నాయకులను గెలిపించినందుకు ఓటర్లకు ఈటల రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాల అభివృద్ధిలో తన సహకారం ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.

Latest