ఉత్సాహంగా సాగుతున్న ‘టి.టి.ఎ సేవా డేస్’.
* నేడు గచ్చిబౌలిలో 10కే రన్.
* గ్రామీణ పర్యటనలకు సిద్ధమవుతున్న బృందం.
* డిసెంబర్ 23 వరకు కొనసాగనున్న కార్యక్రమాలు.
హైదరాబాద్, మహా.
తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టి.టి.ఎ) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సేవా డేస్ – 2025’ కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతున్నాయి. డిసెంబర్ 8న ప్రారంభమైన ఈ సేవా యజ్ఞం ప్రస్తుతం కీలక దశకు చేరుకుంది. గత ఐదు రోజులుగా నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో పలు సేవా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న టి.టి.ఎ బృందం, ప్రస్తుతం హైదరాబాద్ వేదికగా తమ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. శనివారం హైదరాబాద్ కేంద్రంగా అత్యంత కీలకమైన కార్యక్రమం జరిగింది. ఏఐజీ హాస్పిటల్ సహకారంతో ‘టి.టి.ఎ మెడికల్ కన్వెన్షన్’ను డాక్టర్ ద్వారకానాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ సదస్సు వైద్య రంగంలోని తాజా పరిణామాలు , ప్రవాస వైద్యుల సేవలను రాష్ట్రానికి అందించే దిశగా సాగుతోంది. నిన్నటి వరకు జిల్లాల్లో పాఠశాలల అభివృద్ధి, విద్యార్థులకు సాయం, ఆరోగ్య శిబిరాలతో బిజీగా గడిపిన బృందం, నేడు వైద్య సదస్సుపై దృష్టి సారించింది.
ఈ సేవా ఉత్సవాల్లో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో భారీ ఎత్తున ‘10కే వాక్/రన్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. విశ్వ మరియు ప్రవీణ్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ రన్‌కు నగర ప్రజల నుండి విశేష స్పందన లభించే అవకాశం ఉంది. ఈ కార్యక్రమం పూర్తయిన వెంటనే, సోమవారం (డిసెంబర్ 15) నుండి టి.టి.ఎ బృందం వరంగల్, ములుగు జిల్లాల పర్యటనకు వెళ్లనుంది. అక్కడ హన్మకొండలో మహిళలకు ఉచిత ఆరోగ్య శిబిరాలు, దేశాయిపేటలో కంప్యూటర్ల విరాళం, ములుగులో నూతన పాఠశాల భవన నిర్మాణం వంటి కార్యక్రమాలను చేపట్టనున్నారు.
టి.టి.ఎ అధ్యక్షుడు నవీన్ రెడ్డి మల్లిపెద్ది, వ్యవస్థాపకులు డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి నేతృత్వంలో డిసెంబర్ 23 వరకు ఈ సేవా కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగనున్నాయి. రంగారెడ్డి, యాదాద్రి, మహబూబ్ నగర్, నల్గొండ, సూర్యాపేట, మెదక్ జిల్లాల్లో రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ లింబ్స్ పంపిణీ, డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు, క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులు వంటి బృహత్తర కార్యక్రమాలకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రవాసంలో ఉన్నప్పటికీ సొంత గడ్డపై ప్రేమతో టి.టి.ఎ సభ్యులు చేస్తున్న ఈ సేవలను స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు అభినందిస్తున్నారు.







