- తెలంగాణ సెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
- ఈనెల 22 నుంచి 24వ తేదీ వరకు పరీక్షలు
హైదరాబాద్, మహా : తెలంగాణ సెట్ ఎగ్జామ్ – 2025 పరీక్షల కొత్త తేదీలు వెలువడ్డాయి. ఈనెల 22, 23, 24 తేదీల్లో ఈ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 22 న ఉదయం ఒక సెషన్ లో కొన్ని సబ్జెక్టులు, మధ్యాహ్నం జరిగే రెండో సెషన్ లో మరికొన్నిసబ్జెక్టుల పేపర్లు జరుగుతాయి. మొదటి రోజు జియాగ్రఫీ, జర్నలిజం, సంస్కృతం, హిందీ, లైఫ్ సైన్సెస్ పేపర్లు నిర్వహిస్తారు. మధ్యాహ్నం ఉర్దూ, తెలుగు, ఎడ్యుకేషన్, లింగ్విస్టిక్స్ ఉంటాయి. ఈ ఏడాది టీఎస్ సెట్ ను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తోంది. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ల ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే పూర్తి అయింది. ఈనెల 24వ తేదీతో అన్ని పేపర్లు పూర్తవుతాయి.
టీజీ సెట్ -2025ను రెండు పేపర్లలో నిర్వహిస్తారు. పేపర్-1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్-2లో 100 ప్రశ్నలకు 200 మార్కులతో ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో మూడు గంటల పాటు పరీక్ష నిర్వహించనున్నారు. ఆబ్జెక్టివ్ తరహాలో 50 ప్రశ్నలకు పేపర్–1 ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 2 మార్కులు కేటాయిస్తారు. ఇందులో అభ్యర్థుల బోధన/పరిశోధన ఆప్టిట్యూడ్ను పరీక్షించే విధంగా ప్రశ్నలుంటాయి. అలాగే తార్కిక సామర్థ్యం, గ్రహణశక్తి, భిన్నమైన ఆలోచనల దృక్పథాన్ని పరిశీలించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. ఈ పేపర్లో అభ్యర్థులు ఎంపిక చేసుకున్న సబ్జెక్టు నుంచి ఆబ్జెక్టివ్ తరహాలో ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 2 మార్కుల చొప్పున 100 ప్రశ్నలను అడుగుతారు.
ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ,నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో పరీక్ష కేంద్రాలుంటాయి. టీఎస్ సెట్ నోటిఫికేషన్తో పాటు ముఖ్యమైన అప్డేట్స్ కోసం http://telanganaset.org/ వెబ్ సైట్ ను చూడాలని అధికారులు పేర్కొన్నారు







