మోదీ నా కళ్లలోకి చూసే ధైర్యం చేయలేకపోతున్నారు.
* ఢిల్లీ ధర్నాలో ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్యలు
* ఓట్ల చోరీతోనే బీజేపీ గెలుపు.. ఈసీ ఎందుకు మౌనంగా ఉంది?
* హస్తినలో దద్దరిల్లిన కాంగ్రెస్ మహాధర్నా.. పాల్గొన్న రేవంత్, రాహుల్
* ప్రజలకు మోదీ, షాలపై నమ్మకం పోయింది.
* రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ అగ్రనేతల గర్జన.
* రాజ్యాంగ రక్షణ కోసమే మా పోరాటం.
* ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ భారీ శక్తిప్రదర్శన.
ఢిల్లీ, మహా.
దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక రామ్లీలా మైదానం ఆదివారం మధ్యాహ్నం కాంగ్రెస్ శ్రేణుల నినాదాలతో దద్దరిల్లింది. ఎన్నికల వ్యవస్థలో లోపాలు, ఓటర్ల జాబితాలో అక్రమాలు, ఈసీ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘ఓట్ చోర్, గద్దీ ఛోడ్’ మహా ధర్నాలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ, అమిత్ షాల తీరును ఎండగడుతూ ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించాయి.
మోదీ నా కళ్లలోకి చూసే ధైర్యం చేయలేకపోతున్నారు
ఢిల్లీ ధర్నాలో ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఎన్నికల అక్రమాలపై కాంగ్రెస్ పార్టీ ఆదివారం ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో నిర్వహించిన మహా ధర్నా వేదికగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన ఓటు హక్కును బీజేపీ దొంగిలిస్తోందని, ఓట్ల చోరీ ద్వారానే ఆ పార్టీ విజయాలు సాధిస్తోందని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. కర్ణాటక, మహారాష్ట్ర, హర్యానా, బీహార్ రాష్ట్రాల్లో ఓట్ల చోరీ జరిగిందని, ఈ అక్రమాలపై తాము పోరాటం ఆపబోమని ఆమె స్పష్టం చేశారు. ఓటుకు పదివేల రూపాయలు ఇస్తున్నా ఎన్నికల సంఘం ఎందుకు మౌనంగా ఉంటోందని, ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని ఆమె ప్రశ్లల వర్షం కురిపించారు.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై ప్రియాంక గాంధీ వ్యక్తిగత స్థాయిలో ఘాటు విమర్శలు చేశారు. ప్రధాని మోదీ ప్రజల ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయారని, ఆయన తప్పు చేశారు కాబట్టే పార్లమెంటులో తాము మాట్లాడుతుంటే కళ్లలోకి కళ్లు పెట్టి చూడలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. దేశ ప్రజలకు మోదీ, అమిత్ షాలపై నమ్మకం సన్నగిల్లిందని అన్నారు. దేశం ఐక్యంగా ఉండటం కోసం, న్యాయం కోసం తమ నాయకుడు రాహుల్ గాంధీ 8 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. అలాగే, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ వయసులోనూ ప్రజల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారని కొనియాడారు. రాజ్యాంగ, ప్రజాస్వామ్య రక్షణ కోసమే తాము ఈ ‘ఓట్ చోర్, గద్దీ ఛోడ్’ ఉద్యమాన్ని చేపట్టామని ఆమె వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ మహాధర్నాకు దేశం నలుమూలల నుంచి కార్యకర్తలు పోటెత్తారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు, ఈసీ-బీజేపీ కుమ్మక్కు ఆరోపణలపై జరిగిన ఈ నిరసనలో కాంగ్రెస్ అగ్రనాయకత్వం కదంతొక్కింది. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో పాటు తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ సహా పలువురు ఎంపీలు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఈ ధర్నా ద్వారా ఎన్నికల వ్యవస్థలో పారదర్శకతను డిమాండ్ చేస్తూ, కేంద్రానికి గట్టి హెచ్చరిక పంపాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
రామ్లీలా మైదానంలో కిక్కిరిసిన జనసందోహాన్ని ఉద్దేశించి నేతలు ప్రసంగిస్తూ, రాబోయే రోజుల్లో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు. బోగస్ ఓట్ల ఏరివేత, అర్హులైన ఓటర్ల తొలగింపు వంటి చర్యలను అడ్డుకుంటామని, రాజ్యాంగ సంస్థలు స్వతంత్రంగా పనిచేసేలా ఒత్తిడి తెస్తామని కాంగ్రెస్ నేతలు ముక్తకంఠంతో నినదించారు. ప్రియాంక గాంధీ ప్రసంగం కార్యకర్తల్లో కొత్త జోష్ నింపగా, ఈ ధర్నా జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.








