Mahaa Daily Exclusive

  బీఆర్ఎస్‌కు భవిష్యత్తు లేదు.. భాజపాకు తెలంగాణలో స్థానం లేదు:టీపీసీసీ చీఫ్ మహేశ్

Share

ఫ్యూచర్ సిటీ పూర్తయితే ఏ రాష్ట్రం మనకు సాటిరాదు.
* వచ్చే ఎన్నికల్లో గెలుపు నల్లేరు మీద నడకే.
* బీఆర్ఎస్‌కు భవిష్యత్తు లేదు.. భాజపాకు తెలంగాణలో స్థానం లేదు.
* జైలుకు వెళ్లొచ్చిన కవిత సీఎం కావాలనుకుంటున్నారు.
* టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు.
ఢిల్లీ, మహా.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఫ్యూచర్ సిటీ’ నిర్మాణం పూర్తయితే దేశంలో ఏ రాష్ట్రం కూడా తెలంగాణతో పోటీ పడలేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర అభివృద్ధిపై స్పష్టమైన విజన్ ఉందని, ఆ దూరదృష్టి కారణంగానే నేడు హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం, భూముల విలువలు భారీగా పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న పాలన పట్ల ప్రజలు అత్యంత సంతోషంగా ఉన్నారని, దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధిక సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వమే అందిస్తోందని తెలిపారు. ఈ సానుకూల పవనాల వల్ల వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు నల్లేరు మీద నడకలా సులభం కానుందని జోస్యం చెప్పారు.
రాష్ట్ర రాజకీయాలపై స్పందిస్తూ బీఆర్ఎస్ పార్టీపైన, ఎమ్మెల్సీ కవితపైన మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ నానాటికీ బలహీనపడుతోందని, క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి కేడర్ పూర్తిగా కనుమరుగైందని ఎద్దేవా చేశారు. జైలుకు వెళ్లొచ్చిన కవిత.. ఇప్పుడు సీఎం కావాలని కోరుకుంటున్నారని, మనిషికి ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదంటూ చురకలు అంటించారు. అసలు బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తే ఉంటే కవిత బయటకు ఎందుకు వస్తారని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ పనైపోయిందనడానికి జూబ్లీహిల్స్ ఎన్నికలే నిదర్శనమని, అక్కడ ఓడిపోతామని తెలిసే కేసీఆర్ ప్రచారానికి కూడా రాలేదని గుర్తుచేశారు.
భారతీయ జనతా పార్టీపై కూడా మహేశ్ కుమార్ గౌడ్ విరుచుకుపడ్డారు. తెలంగాణ గడ్డపై బీజేపీ ఎప్పటికీ అధికారంలోకి రాలేదని తేల్చి చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రజలకు కేవలం 10 కిలోల దొడ్డు బియ్యం ఇవ్వడం తప్ప, మరో సంక్షేమ పథకమేదీ అమలు కావడం లేదని విమర్శించారు. ఎస్ఐఆర్ విధానంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన ఉంటూ, అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తోందని ఆయన పునరుద్ఘాటించారు.

Latest