అనకాపల్లిలో ‘అణు’వైన అడుగు.
* 3 వేల ఎకరాల్లో బార్క్ భారీ ప్రాజెక్ట్!
* ఆంధ్రప్రదేశ్‌లో బార్క్ క్యాంపస్‌కు లైన్ క్లియర్.
* ఏపీలో ప్రపంచ స్థాయి అణు పరిశోధన కేంద్రం.
* గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం.
హైదరాబాద్, మహా.
భారత అణుశక్తి రంగంలో ఆంధ్రప్రదేశ్ కీలక కేంద్రంగా మారబోతోంది. దేశీయ అణు పరిశోధనలను కొత్త పుంతలు తొక్కిస్తూ, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అనకాపల్లి జిల్లాలో ప్రతిష్టాత్మకమైన క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించిన కీలకమైన అటవీ భూమి బదలాయింపునకు కేంద్ర పర్యావరణ శాఖ నుంచి అనుమతులు లభించడంతో, ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణానికి మార్గం సుగమమైంది.
భారత అణుశక్తి పరిశోధనల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశంలో అణు శాస్త్ర పరిశోధనలు, అధునాతన రియాక్టర్ టెక్నాలజీలను బలోపేతం చేసే లక్ష్యంతో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో సుమారు 3,000 ఎకరాల విస్తీర్ణంలో భారీ పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని (ఆర్ అండ్ డి) ఏర్పాటు చేయనుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటివరకు ఉన్న ప్రధాన అడ్డంకులు తొలగిపోవడంతో పనులు వేగవంతం కానున్నాయి.
ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే 1,200 హెక్టార్లకు పైగా రెవెన్యూ భూమిని సేకరించగా, క్యాంపస్ నిర్మాణంలో అత్యంత కీలకమైన 148.15 హెక్టార్ల అటవీ భూమిని బదలాయించేందుకు బార్క్ చేసిన ప్రతిపాదనకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ పరిధిలోని నిపుణుల కమిటీ తాజాగా సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ప్రాజెక్టు మాస్టర్ ప్లాన్‌లో ఈ అటవీ భూమి ఎంతో కీలకం కావడంతో, ఈ అనుమతితో నిర్మాణ పనులకు తొలి అడ్డంకి తొలగిపోయినట్లయింది.
దేశీయంగా అణు ఆవిష్కరణలు, స్వచ్ఛ ఇంధన వనరులపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన తరుణంలో ఈ కొత్త కేంద్రం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది రియాక్టర్ల అభివృద్ధి, నూతన ఇంధన సాంకేతికతలలో బార్క్ పాత్రను మరింత విస్తరిస్తుందని, భవిష్యత్తు అణు అవసరాలకు ఈ క్యాంపస్ ఒక కేంద్ర బిందువుగా మారుతుందని అధికారులు భావిస్తున్నారు. కాగా, బార్క్ ఇప్పటికే స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ల డిజైన్ పనులను ప్రారంభించినట్లు కేంద్రం ఇటీవల పార్లమెంటు వేదికగా వెల్లడించింది.
మరోవైపు, రష్యాకు చెందిన రోసటామ్‌తో కలిసి చిన్న, పెద్ద అణు విద్యుత్ ప్రాజెక్టులపై సహకారం కోసం భారత అణుశక్తి విభాగం చర్చలు జరుపుతోంది. ఈ నేపథ్యంలో అనకాపల్లిలో ఏర్పాటు కానున్న ఈ భారీ క్యాంపస్, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అణు పరిశోధనలకు వేదికగా నిలవడమే కాకుండా, ప్రాంతీయంగా కూడా అభివృద్ధికి బాటలు వేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.






