తెలంగాణలో యూరియా యాప్ ప్రభంజనం.
* 1.15 లక్షల బస్తాల బుకింగ్‌తో సరికొత్త రికార్డు.
* యూరియా యాప్ ద్వారా లబ్ధి పొందిన 20 వేల మంది రైతులు.
* యూరియా యాప్‌కు అన్నదాతల నీరాజనం
* జిల్లాల వారీగా ఊపు అందుకున్న యూరియా ఆన్‌లైన్ బుకింగ్స్.
* అగ్రస్థానంలో పెద్దపల్లి జిల్లా.
హైదరాబాద్, మహా.
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఫెర్టిలైజర్ బుకింగ్ మొబైల్ యాప్ అనూహ్య విజయాన్ని నమోదు చేస్తోంది. క్షేత్రస్థాయిలో ఎరువుల పంపిణీని క్రమబద్ధీకరించేందుకు, దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ డిజిటల్ విధానం ఆశించిన దానికంటే వేగంగా రైతుల చెంతకు చేరింది. అధికారిక గణాంకాల ప్రకారం, ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 1,15,534 యూరియా బస్తాలు ఈ యాప్ ద్వారా బుక్ అయ్యాయి. సుమారు 19,695 మంది రైతులు ఈ సాంకేతికతను వినియోగించుకుని తమకు కావాల్సిన ఎరువులను ముందస్తుగా రిజర్వ్ చేసుకున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేతృత్వంలో ప్రారంభమైన ఈ ప్రయోగం, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో ఒక ప్రధాన మార్పుగా పరిగణించబడుతోంది.
జిల్లాల వారీగా పరిశీలిస్తే, పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిన ప్రాంతాల్లో రైతుల స్పందన అద్భుతంగా ఉంది. పెద్దపల్లి జిల్లా 6,289 మంది రైతులతో బుకింగ్స్‌లో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. దీని వెంటే జనగామ జిల్లాలో 5,150 మంది రైతులు, మహబూబ్‌నగర్ జిల్లాలో 3,741 మంది, మరియు నల్గొండ జిల్లాలో 3,618 మంది రైతులు విజయవంతంగా యూరియాను బుక్ చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో కూడా 897 మంది రైతులు ఈ యాప్ ద్వారా లబ్ధి పొందారు. కేవలం పట్టాదారులకే కాకుండా, కౌలు రైతుల సమస్యలను కూడా ప్రభుత్వం ఈ యాప్ ద్వారా పరిష్కరించింది. ఇప్పటివరకు 217 మంది కౌలు రైతులు 678 యూరియా బస్తాలను బుక్ చేసుకోవడం ఈ విధానం యొక్క పారదర్శకతకు నిదర్శనంగా నిలుస్తోంది.
ఈ యాప్ పనితీరులో ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిబంధనలు అక్రమాలకు తావులేకుండా చేస్తున్నాయి. రైతులు తమ ఆధార్ లేదా పాస్‌బుక్ వివరాలతో లాగిన్ అవ్వగానే, వారి భూమి విస్తీర్ణం, పండిస్తున్న పంట ఆధారంగా ఎన్ని బస్తాల ఎరువులు అవసరమో సాఫ్ట్‌వేర్ దానంతట అదే గుర్తిస్తుంది. బుకింగ్ పూర్తయిన 24 గంటల లోపు సంబంధిత డీలర్ వద్దకు వెళ్లి ఎరువులు తీసుకోవాల్సి ఉంటుంది, లేనిపక్షంలో ఆ బుకింగ్ రద్దై ఇతరులకు అవకాశం లభిస్తుంది. ఈ నిబంధన వల్ల ఎరువుల నిల్వలు అనవసరంగా బ్లాక్ కాకుండా, నిజమైన అవసరమున్న రైతులకే అందుతున్నాయి. పనులు వదులుకుని దుకాణాల వద్ద గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా, తమ ఫోన్ ద్వారానే నిమిషాల్లో బుకింగ్ చేసుకునే వెసులుబాటు కలగడంపై రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది.





