* వేములవాడ రాజన్న క్షేత్రానికి పోటెత్తిన భక్తులు..
* దర్శనానికి 5 గంటల సమయం.
* రాజన్న సన్నిధిలో కోడె మొక్కుల కోలాహలం.
* పోలీసుల భారీ బందోబస్తు.
వేములవాడ,మహా.
రాజన్న క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళ్లే ముందు వేములవాడ రాజన్నకు కోడె మొక్కులతో పాటు వివిధ ఆర్జిత సేవలు చెల్లించుకోవడం భక్తులకు అనాదిగా వస్తున్న ఆనవాయితీ. ఈ నేపథ్యంలోనే జాతర సమయం దగ్గరపడుతుండటంతో రాజన్న సన్నిధికి భక్తుల రాక ఒక్కసారిగా పెరిగింది.
ప్రస్తుతం వరుస సెలవులు రావడంతో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచే కాకుండా, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన కోడె మొక్కులు చెల్లించుకుని, ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం క్షేత్రంలోని బద్ది పోచమ్మ అమ్మవారిని దర్శించుకుని బోనాలు, పట్నం మొక్కులు సమర్పించుకున్నారు. దీంతో క్యూలైన్లతో పాటు ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ప్రస్తుతం సాధారణ దర్శనానికి 5 గంటలకు పైగా సమయం పడుతోంది.
భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో రమాదేవి స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. తాగునీరు, క్యూలైన్ల నిర్వహణపై సిబ్బందికి తగు సూచనలు చేశారు. రద్దీని క్రమబద్ధీకరించడానికి ఏఎస్పీ రిత్విక్ సాయి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం నిఘా ఉంచారు.






