Mahaa Daily Exclusive

  మద్యం మత్తులో భార్య కిరాతకం: భర్తను గొడ్డలితో 26 వేట్లు పొడిచి హత్య…

Share

* మద్యం మత్తులో భార్య కిరాతకం: భర్తను గొడ్డలితో 26 వేట్లు పొడిచి హత్య
* కాన్పూర్‌లో దారుణం.
* భార్యాభర్తల గొడవ.. గొడ్డలితో వేటాడి చంపిన వీరాంగన.
* తాగిన మైకంలో విచక్షణ కోల్పోయిన భార్య..
* భర్త మృతితో అనాథగా మారిన నాలుగేళ్ల బాలుడు.

కాన్పూర్,మహా.

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లా బితూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న తిక్ర గ్రామంలో సభ్యసమాజం తలదించుకునేలా ఒక భయంకరమైన హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన ఓ మహిళ, తన భర్తను గొడ్డలితో 26 సార్లు నరికి అత్యంత కిరాతకంగా చంపేసింది.
పోలీసులు , స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, తిక్ర గ్రామానికి చెందిన రవిశంకర్ (45), వీరాంగన దంపతులు. వీరికి నాలుగేళ్ల కుమారుడు జైన్ ఉన్నాడు. అయితే, మద్యం అలవాటు కారణంగా ఈ దంపతుల మధ్య నిత్యం ఘర్షణలు జరుగుతుండేవి. ఈ క్రమంలో మనస్పర్థలు రావడంతో రవిశంకర్ తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తుండగా, వీరాంగన అదే గల్లీలో తన కుమారుడితో కలిసి వేరుగా ఉంటోంది. వేరువేరుగా ఉంటున్నప్పటికీ, ప్రతిరోజూ సాయంత్రం మద్యం సేవించిన తర్వాత ఇద్దరూ ఒకరి ఇంటి వద్దకు మరొకరు వెళ్లి ఘర్షణ పడటం పరిపాటిగా మారింది.
ఘటన జరిగిన రోజున కూడా ఇరువురు మద్యం సేవించి గొడవకు దిగారు. మాటా మాటా పెరగడంతో ఆగ్రహానికి గురైన రవిశంకర్ మొదట రోకలితో వీరాంగన తలపై కొట్టాడు. దీంతో తీవ్ర కోపోద్రిక్తురాలైన వీరాంగన, ఇంట్లోని గొడ్డలిని తీసుకుని రవిశంకర్‌పై విచక్షణారహితంగా దాడి చేసింది. ఆమె దాడికి రవిశంకర్ అక్కడికక్కడే కుప్పకూలిపోయినప్పటికీ, ఆవేశం చల్లారని వీరాంగన ఏకంగా 26 సార్లు గొడ్డలితో నరికింది. ఈ ఘోర దాడిలో రవిశంకర్ శరీరమంతా తీవ్ర గాయాలై రక్తపు మడుగులో పడిపోయాడు.
హత్య చేసిన అనంతరం తన నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు వీరాంగన నాటకమాడింది. తన భర్త కిందపడి గాయపడ్డాడని, తీవ్ర రక్తస్రావం అవుతోందంటూ ఏడుస్తూ బంధువులకు ఫోన్ చేసింది. వారు అక్కడికి చేరుకునే సమయానికి ఆమె నేలపై ఉన్న రక్తపు మరకలను తుడిచేస్తూ కనిపించింది. ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. తీవ్ర గాయాలతో ఉన్న రవిశంకర్‌ను పోలీసులు ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయాడు.
వైద్యులు నిర్వహించిన పోస్టుమార్టంలో రవిశంకర్ శరీరంపై 26 గొడ్డలి వేట్లు ఉన్నట్లు తేలింది. దీని ఆధారంగా బితూర్ పోలీసులు నిందితురాలైన వీరాంగనను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితురాలిని అరెస్ట్ చేసి జైలుకు తరలించినట్లు బితూర్ ఎస్‌హెచ్‌ఓ ప్రేమ్ నారాయణ్ విశ్వకర్మ తెలిపారు. హత్యకు ఉపయోగించిన గొడ్డలిని మాయం చేసినట్లు గుర్తించిన పోలీసులు, దానిని స్వాధీనం చేసుకునేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు. మద్యానికి బానిసలైన భార్యాభర్తల గొడవ చివరకు ఒకరి ప్రాణం తీయడమే కాకుండా, పసివాడిని అనాథను చేయడం స్థానికంగా విషాదాన్ని నింపింది.

Latest