- పాలమూరు-రంగారెడ్డికి ఎన్నో కష్టాలు
- ఇప్పటిదాకా సగం వ్యయమే.. పూర్తి కావాలంటే ఇంకా 20వేల కోట్లు
- బీఆర్ఎస్ హయాంలో చిన్నచూపే
- పొలిటికల్ యుద్దానికే ప్రాజెక్టు వినియోగం.. గోదావరి ప్రాజెక్టులతో పోలిస్తే నిర్లక్ష్యం
- ఇప్పటిదాకా పాలమూరుకు రూ.32వేల కోట్ల ఖర్చు.. అయినా అందని నీరు
- కాంగ్రెస్ హయాంలో రూ.5వేలకోట్లకు పైగా చెల్లింపులు.. దశలవారీ పూర్తికి వ్యూహం
హైదరాబాద్, మహా
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఇప్పటికిపుడు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనబడడం లేదు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రకరకాల కారణాలు చెప్పి ప్రాజెక్టుపై నిర్లక్ష్యం ప్రదర్శించగా, ఈ ప్రభుత్వంలో కూడా ఆశించిన స్థాయిలో ముందుకు కదలడం లేదు. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీరివ్వాలంటే రాష్ట్రప్రభుత్వం సుమారు మరో రూ.25 వేల కోట్లు ఖర్చు ఉంటుందని నీటిపారుదలశాఖ అధికారులు లెక్కలు వేశారు. పంపుహౌస్‌లు, రిజర్వాయర్లు కొలిక్కివచ్చినా ప్రధానపనుల్లో ఇంకా కొన్నిపెండింగ్లో ఉన్నాయి. ప్రధాన కాల్వలు పూర్తి సహా డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ పనులు జరగాల్సి ఉంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల అంచనా వ్యయం రూ.56 వేల కోట్లు కాగా ఇప్పటివరకు రూ.32వేల 67 కోట్లు ఖర్చుచేశారు. అందులో 2023 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.26 వేల 472 కోట్లు ఖర్చు చేయగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండేళ్లలో రూ.5వేల 595 కోట్లు చెల్లించారు. మిగిలిన పనులు పూర్తిచేసేందుకు మరో రూ.25వేల కోట్లు అవసరమని నీటిపారుదల శాఖ అంచనా వేసింది. ఒప్పందం ప్రకారం పెరిగిన ధరలను నిర్మాణ సంస్థలకు చెల్లించాల్సి ఉన్నందున ప్రాజెక్టు పూర్తయ్యేలోగా ఆ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. అయితే మొత్తం ప్రాజెక్టును సమీక్షించిన సీఎం దశలవారీగా పూర్తిచేసేందుకు అంచనాలు రూపొందించమని మంత్రి ఉత్తమ్, అధికారులకు సూచించినట్లు తెలిసింది.
12.3 లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యం
శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి 60 రోజుల్లో 90 టీఎంసీలని ఎత్తిపోసి ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోని 12.3 లక్షల ఎకరాల ఆయకట్టుకి నీరందించాలని ప్రాజెక్టు లక్ష్యంగా పెట్టుకున్నారు 2015 జూన్‌లో రూ.35వేల 200 కోట్ల అంచనా వ్యయంతో పరిపాలనా అనుమతిచ్చిన ప్రభుత్వం పంపుహౌస్‌లు, రిజర్వాయర్లు, ప్రధానకాల్వ పనులని 18 ప్యాకేజీలుగా విభజించి గుత్తేదారులకి అప్పగించింది. పనులు, రిజర్వాయర్లలో ముంపు ప్రాంతంకోసం 40వేల ఎకరాలు సేకరించడం సహా 4వేల111 కుటుంబాలకు పునరావాసం కల్పించాలని ప్రతిపాదించారు. శ్రీశైలం నుంచి నార్లాపూర్ రిజర్వాయర్‌కు నీటిని మళ్లించేందుకు అప్రోచ్‌ఛానల్, పంపుహౌస్‌లు రిజర్వాయర్ల నిర్మాణం కొలిక్కి వచ్చాయి. నార్లాపూర్ నుంచి ఏదులకు నీటిని మళ్లించే కాలువ పని ఇంకా పూర్తి కాలేదు. ఇదే ప్రధాన అడ్డంకిగా ఉంది. ఇప్పటికే అనేకసార్లు గడువు పొడిగించగా డిసెంబరు నాటికి పని పూర్తిచేస్తామని చెప్పినా ఇంకా సమయంపట్టే అవకాశం ఉందని సంబంధితవర్గాలు తెలిపాయి. నార్లాపూర్ పంపుహౌస్‌లో 9 పంపులు, మోటార్లు అమర్చాల్సి ఉండగా నాలుగింటికి ట్రయల్‌రన్ చేశారు. మిగిలిన 3 పంపుహౌస్‌లలో ఒక దాంట్లో ఐదు, మరోదానిలో మూడు పంపులు అమర్చారు. నాలుగో పంపుహౌస్‌లో రెండు అమర్చడం దాదాపు పూర్తైంది. నార్లాపూర్-ఏదుల మధ్య కాలువ పనిపూర్తయితేనే శ్రీశైలం నుంచి నీటిని మళ్లించడానికి అవకాశం ఉంటుందని తాగునీటి అవసరాలకి వినియోగించుకోవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. నిధుల విడుదలలో జాప్యం వల్ల పనులు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. అన్ని పంపుహౌస్‌లలో పూర్తిస్థాయిలో మోటార్లు, పంపులు అమర్చేందుకు మరో రెండేళ్లు పట్టే అవకాశం ఉందని ఇంజినీరింగ్ వర్గాలు పేర్కొన్నాయి.
వెంటపడితేనే
2023 డిసెంబరులో కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టే నాటికి ఈ ప్రాజెక్టుపై రూ.26,472 కోట్లు ఖర్చు చేశారు ప్రధాన పనుల్లో కొన్ని ఓదశకు రాగా, 2023 సెప్టెంబరులో అప్పటి భారాస ప్రభుత్వం ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేసింది. కానీ దిగువన పనులు పెండింగ్‌లో ఉండటంతో పథకం కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికైనా మిగిలిన పనులు అంచనావేసి నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేసేలా కాంట్రాక్టర్లపై ఒత్తిడి తేవడం, గడువు పొడిగించినా పనులుచేయనివారిపై చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ వర్గాలు సూచిస్తున్నాయి. అవసరమైన నిధులను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచితేనే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రయోజనాలు రైతులకు అందుతాయని అభిప్రాయపడుతున్నాయి.







